నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లాలో ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ కు నిత్యం దేశ నలుమూలల నుండే కాకుండా విదేశాల నుండి కూడా పర్యాటకులు వస్తుంటారు.ఇక్కడికి వచ్చిన వారికి సాగర్ అందాలతో పాటు ఆరోగ్య కరమైన తాజాగా దొరికే చేపలు గుర్తుకువస్తాయి.
పర్యటన అనంతరం చేపల ప్రియులు ఇక్కడ దొరికే చేపలను ఫ్రై,కర్రీ చేయించుకుని ఇష్టంగా తింటుంటారు.చికెన్ మటన్‌తో పోల్చుకుంటే చేపలో కొవ్వు తక్కువగా ఉంటుందని నాన్‌వెజ్ ప్రియులు కొంటుంటారు.
నదుల్లో చేపలైతే సహజమైన ఆహారంతో సహజ సిద్ధంగా పెరుగుతాయని భావిస్తారు.
కానీ,ఇక్కడ పర్యాటకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కొందరు వ్యాపారులు కృత్రిమంగా ఏర్పాటు చేసిన చెరువులు,కుంటల్లో చేపలను పెంచుతూ వాటికి లాభాలను ఆర్జించాలని జీవ వ్యర్థాలను ఆహారంగా వేస్తూ పెంచిన చేపలను సాగర్ రిజర్వాయర్ చేపలని నమ్మిస్తూ విక్రయిస్తూ,వాటినే ప్రై,కర్రీ చేసి పెడుతూ ధనార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రోజుల తరబడి అమ్ముడుపోని చేపలను ఐస్ బాక్సులలో ఉంచి కుళ్ళిన అనంతరం చేపలను ఫ్రై చేసి పర్యాటకులకు పెడుతున్నారని,దీనితో అనేక మంది చేపల ప్రియులు అనారోగ్యం బారిన పడుతున్నారని వాపోతున్నారు.
ఈవిధంగా పెంచిన చేపలను తింటే ఆరోగ్యానికి హానికరమని వైద్యులు కూడా చెబుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల,పర్యాటకుల ఆరోగ్యాలను కాపాడాలని కోరుతున్నారు.ఇదిలా ఉంటే నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ బుద్ధవనం నుండి పైలాన్ నూతన వంతెన వరకు రహదారిపై ఎక్కడ చూసినా చేపల దుకాణాలే వెలశాయి.
రోడ్డుకు ఇరువైపులా చేపల దుకాణాలు ఉండటంతో చేపల వ్యర్ధాలను ఎక్కడబడితే అక్కడ పడవేయడంతో దుర్వాసనను వెదజల్లుతుంది.
అంతేకాకుండా చేపల వ్యర్థాల కోసం కుక్కలు, పందులు రోడ్లపై వచ్చి స్వైరవిహారం చేస్తూ ప్రమాదాలకు కారణమౌతున్నాయి.
కుక్కలు,పందులు ఎక్కువగా చేపల దుకాణాల దగ్గర కనిపిస్తూ వినియోగదారులకు కూడా ఇబ్బంది కలిగిస్తున్నాయి.గతంలో అనేకసార్లు వాహనదారులు రోడ్డు ప్రమాదంలో విగతజీవులుగా మారిన సందర్భాలు ఉన్నాయి.నాగార్జునసాగర్-గుంటూరు జాతీయ రహాదారిపై ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి.
నాగార్జునసాగర్ సమ్మక్క సారక్క,అర్బన్ పార్కు నుంచి మొదలుపెట్టుకొని నాగార్జునసాగర్ బుద్ధవనం,నూతన వంతెన వరకు ఎక్కడ చూసిన చేపల దుకాణాలే వెలిశాయి.
ఫారెస్ట్ ప్రాంతంలో ఎవరు వెళ్ళద్దని నిబంధనలో ఉన్న కూడా ఫారెస్ట్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తూ ఉండడంతో అధికారులకు తెలిసే ఇదంతా జరుగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.