నల్లగొండ జిల్లా: పారిశ్రామికంగా వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతున్న నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని సాగర్ రోడ్డు లో ట్రాఫిక్ సమస్య వేధిస్తుంది.ట్రాఫిక్ ను నియంత్రించడంలో ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ విఫలైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సెట్ బ్యాక్ లేకుండా రోడ్డుపైకి వచ్చి అక్రమ కట్టడాలు,తాత్కాలిక నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు మామూళ్లకు అలవాటుపడి మీనమేషాలు లెక్కిస్తుండడతో పట్టణ ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.
గణేష్ మార్కెట్ నుంచి విజేత కాలేజీ రోడ్డు వరకు ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది.
ఉదయం,సాయంత్రం పాఠశాల,కళాశాల విద్యార్థులు వెళ్ళి వచ్చే సమయంలో వ్యాపార లావాదేవీలతో బిజీగా ఉండే గణేష్ మార్కెట్ నుంచి ఆర్టీసీ బస్టాండ్,విజేత కాలేజీ రోడ్డు వరకు నిత్యం రద్దీగా ఉంటోంది.ఇదే రద్దీలో కేటీఎం, డ్యూక్,ఇతర బైక్ లను ఫాస్ట్ గా నడుపుతూ పాదాచారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న పరిస్థితి నెలకొంది.
తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
సామాన్య ప్రజలు,విద్యార్థులు క్షేమంగా రాకపోకలు సాగించేందుకు సహకరించాల్సిన బాధ్యత పౌరులందరిపై ఉంది.
అయితే ఆర్టీసీ బస్టాండ్, రైతు బజారు సమీపంలో పూర్తిస్థాయిలో రోడ్డును ఆక్రమించిన ఓ పండ్ల వ్యాపారి ఓ పెద్ద బండ్ల షాపును నిర్వహిస్తున్నారు.ఇక్కడే శాశ్వత అక్రమ నిర్మాణం చేపట్టిన పండ్ల దుకాణం వ్యాపారి ట్రాఫిక్ సమస్యకు కేరాఫ్ అడ్రస్ గా మారారు.
దీనితో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని పండ్ల దుకాణాన్ని రోడ్డు నుంచి వెనక్కు జరపాలని సూచించిన పట్టణ సీఐ పట్ల ఆ పండ్ల వ్యాపారి దురుసుగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది.
రోడ్డును ఆక్రమించి దుకాణం పెట్టి వ్యాపారం చేసే ఆ పండ్ల వ్యాపారి సీఐ పట్లనే అలా దురుసుగా వ్యవహరించినా అటూ పోలీసు వ్యవస్థ,ఇతర ప్రభుత్వ యంత్రాంగం సైతం స్పందించకపోవడం గమనార్హం.
ఉన్నతాధికారులకు పండ్లు ఇస్తున్నామని, మమ్ములను ఎవరూ ఏమి చేయలేరని సదరు పండ్ల వ్యాపారి ప్రచారం చేసుకోవడం కొసమెరుపు.ట్రాఫిక్ ఎస్ఐ మోహన్ ను వివరణ కోరగా మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ ప్రధాన రహదారిలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించాం.
సమీపంలో నిర్మాణాలు చేపట్టి,ఆటోలు తోపుడు పండ్లు పెట్టి పండ్ల వ్యాపారం నిర్వహిస్తున్న వారికి రోడ్డు పైకి రావద్దని ఇప్పటికే సూచించాం.ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో సహకరించేల మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్,కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళామని చెప్పారు.