నల్లగొండ జిల్లా: రెక్క ఆడితే గాని డొక్కాడని ఆటో డ్రైవర్ల జీవితాలు మహిళలకు ఫ్రి బస్సు పథకంతో ప్రశ్నార్థకంగా మారాయని ఆటోవాలాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుత తమ దీనావస్థను కొందరు ఆటో డ్రైవర్లు శనార్తితో మొరపెట్టుకున్నారు.
ఉదయం లేచింది మొదలు అర్థరాత్రి అయ్యేంత వరకు ఆటోబండి నదిస్తేవే బ్రతుకు బండి ముందుకు కదులుతుందని,ఇప్పటికే రోడ్లు బాగోలేక,డీజిల్ ధరలు పెరిగి సవారీ సక్రమంగా సాగక ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయామని, మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం తమను రోడ్డున పడేసిందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ పథకం ప్రారంభమైన రోజు నుండి ఆటో స్టాండ్స్ లో ఒక్క ఆటో కూడా కదలడం లేదని, దీనితో ఆటో ఫైనాన్స్,ఇంటి అద్దెలు, పిల్లలకు బడి ఫీజులు కట్టలేక,కుటుంబ పోషణ భారమై దిక్కుతోచని స్థితిలో పడ్డామని అన్నారు.
రోజు మొత్తం నిరీక్షించినా డీజిల్ ఖర్చుపోను 30 నుండి 50 రూపాయలు మిగలడం లేదని వాపోయారు.ఒక్క మహిళ కూడా ఆటో ఎక్కడం లేదని,ఆటో ఫైనాన్స్,పిల్లల చదువుకు కలిపి నెలకు 10 వేల నుండి 20 వేలు వరకు కట్టాల్సిన వస్తుందని, మరోపక్క కుటుంబ పోషణ భారమై ఎలా బ్రతకాలో తెలియక అయోమయంలో ఉన్నామన్నారు.ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ఉన్న ఏడు లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి ఉందని,ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్నారని,
అదైనా వెంటనే అమలు చేస్తే కొద్దిలో కొద్దిగా ఆర్ధిక ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం ఉందని,లేకుంటే తమ పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని గోడు వెళ్లబోసుకున్నారు.పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో మాదిరిగా ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి,వారి కుటుంబాలకు స్వయం ఉపాధి పథకాలు అందించాలని కోరారు.ఆటోలను నడిపిస్తూ కుటుంబాలు పోషిస్తున్నామని రమావత్ బద్దు అనే ఆటోడ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మహిళలు ఆటోలు ఎక్కడం లేదని,దీనితో ఉపాధి కోల్పోయే దుస్థితి వచ్చిందని,
రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించాలన్నారు.మా గోడు కూడా పట్టించుకోండి సారూ… అంటూ గంగాపురం నాగార్జున అనే మరో ఆటో డ్రైవర్ గోడు వెళ్లబోసుకున్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆటో మీటర్ల చార్జీలు పెంచారని,పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఅర్ఎస్ ప్రభుత్వం తమను పట్టించుకోలేదని, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఫ్రీ బస్సు పథకంతో మా పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు.తమ సమస్యలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సమయాన్ని కేటాయించాలని,లేదంటే తమ కుటుంబాలు ఆగమై పోతాయని అంటున్నారు.