నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం జంపింగ్ జపాంగుల టైమ్ నడుస్తుంది.అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా అని ఎక్కడ చూసినా ఆ పార్టీ నుండి ఈ పార్టీలోకి,ఈ పార్టీ నుండి ఆ పార్టీలోకి వెళ్ళడం కండువాలు కప్పు కోవడం ఫ్యాషన్ గా మారింది.
అన్ని పార్టీలు ఈ గో.పి.లను గుంజుకోవడానికి కావలసిన అస్త్రశస్త్రాలు సంధిస్తున్నాయి.కొంచెం పార్టీలో అసంతృప్తితో ఉన్నాడని తెలిస్తే చాలు ఎవరితో గాలం వేయాలి, ఎవరు గాలం వేస్తే చిక్కుతారో చూసుకొని, తద్వారా పిలిపించుకొని, స్వయంగా వివిధ పార్టీల అభ్యర్దులే పార్టీలోకి ఆహ్వానించడం,మెడలో కండువా వేయడం జోరుగా సాగుతోంది.
జంపింగ్ చేస్తున్న వారంతా తాము ఇంతకాలం ఉన్న పార్టీలో పట్టించుకోవడంలేదని, గౌరవం,విలువ లేవని, తమ రాత,గీత మారదని ఆఫర్ వచ్చిందే తడవుగా తమకు నచ్చిన పార్టీలోకి గోడ దూకేస్తున్నారు.దీంతో ఎవరు ఏ పార్టీలో ఉన్నారో?ఎందుకు పార్టీలు మారుతున్నారో అర్థంగాక అభ్యర్థుల్లో అలజడి మొదలైంది.కానీ,ప్రజా ప్రతినిధులు,కాస్త పరపతి కలిగిన నాయకులు, కార్యకర్తలు తమ పార్టీలో చేరడంతో అభ్యర్థులకు కొంత మనోధైర్యం కనిపిస్తుంది.మొత్తానికి జంపింగ్ జపాంగులతో అన్ని పార్టీల కార్యాలయాలు కళకళలాడుతున్నాయి.
చివరికి వీరి చేరికలు ఏ పార్టీ అభ్యర్థికి కలిసొస్తుందో,ఎవరిని విజయం వరించి ఎమ్మెల్యేలను చేస్తుందో చూడాలి మరి…!
.