ఇటీవలే కాలంలో ప్రైవేటు ఉద్యోగాలు దొరకడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే.అలాంటిది గవర్నమెంట్ ఉద్యోగం( Govt Jobs ) వస్తుంది అంటే ఇక ఆనందానికి హద్దులు అనేవి ఉండవు.
పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే మాటల్లో చెప్పలేనంత సంతోషం.ఎంతో కష్టపడాలి, పైగా కాస్తంత అదృష్టం కలిసి వస్తేనే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనీ అందరి అభిప్రాయం.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులను నమ్మించి ఏకంగా కోట్లల్లో డబ్బులు తీసుకొని మోసం చేసిన ఘటన రాయదుర్గం( Rayadurgam ) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో చూద్దాం.

రాయదుర్గం సీఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.కోటపల్లి శ్రీనివాస్( Kotapalli Srinivas ) అనే ఓ వ్యక్తి చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండే నిరుద్యోగ యువతీ యువకులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసి పరారయ్యాడు.దీంతో తాము మోసపోయామని గ్రహించిన వారంతా పోలీసులను ఆశ్రయించడంతో కాస్త ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.కోటపల్లి శ్రీనివాస్ ముందు బాధితులందరినీ పరిచయం చేసుకొని వారితో సన్నిహితంగా మెలిగాడు.
ఆ తరువాత ఓఎన్జీసీ, రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని కాకపోతే డబ్బు ఖర్చు అవుతుందని అందరినీ నమ్మించాడు.

చాలా రోజులుగా తమతో పరిచయం ఉండడంతో బాధితులందరూ శ్రీనివాస్ ను గుడ్డిగా నమ్మేశారు.ఒక్కొక్కరి దగ్గర రూ.10 లక్షల నుండి రూ.20 లక్షల వరకు దొరికినంత వరకు దోచేశాడు.ఇలా ఏకంగా 51 మంది నుంచి కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి అక్కడి నుండి ఉడాయించాడు.
కొంతకాలంగా శ్రీనివాస్ కనిపించకపోవడం, ఫోన్ కలవకపోవడం తో బాధితులు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న శ్రీనివాస్ కోసం గాలింపు చర్యలు చేస్తున్నట్లు సీఐ మహేష్ తెలిపారు.







