రాష్ట్రంలో అతిపెద్ద మాఫియా నడుస్తుంది: సీఎల్పీ నేత భట్టి

సూర్యాపేట జిల్లా: 100 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సూర్యాపేట జిల్లాకు చేరుకున్న సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు.

 Biggest Mafia Runs In State Clp Leader Bhatti, Mafia , Clp Leader Bhatti , Brs G-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జిల్లాలో ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కొన్ని నిర్దిష్టమైన ప్రశ్నలు నేను అడగడం జరుగుతుందని,కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం నీళ్లు,నిధులు, నియామకాల సంగతి ఎంత వరకు వచ్చింది?ఇండ్లు,ఇండ్ల స్థలాలు, ప్రజల జీవితాల్లో మార్పు రావడం కోసమే తెలంగాణ వచ్చింది.దశాబ్ద కాలం అవుతున్నా ప్రజలకు ఇందులో ఏ ఒక్కటి కూడా రాలేదు ఎందుకు?కానీ,బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దల జీవితాల్లో మాత్రం అద్భుతమైన మార్పు వచ్చింది ఎలా?

ఏ ప్రజల జీవితాల్లో మార్పు రావాలో? ఏ ప్రజలకైతే సంపద చేరాలో వాళ్లకు చేరలేదు.వాళ్ల పేరుచెప్పి అధికారాన్ని అనుభవిస్తున్న వారికి మాత్రం అపారమైన సంపద సమకూరిందని, వేల కోట్ల రూపాయల ఆస్తులు సమకూరాయని, వందల ఎకరాల ఫామ్ హౌస్ లు వచ్చాయని,నయా గడీ సంస్కృతిని బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో తీసుకొచ్చారని, ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆయన వారసత్వంగా ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు ఫామ్ హౌస్ లు కట్టుకుని కొత్త సంస్కృతిని రాష్ట్రం నుండి జిల్లాల వరకు తీసుకువచ్చారన్నారు.ఈ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించిన మహా నాయకులంతా ప్రజల కోసమే పనిచేశారని,వారి ఆస్తులను అమ్ముకుని ప్రజల కోసం పనిచేశారు తప్ప మీలాగా పదవీ కాలాన్ని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించలేదన్నారు.

కేవలం ఈ పదేళ్లలో ఒక్కసారిగా బీఆర్ఎస్ నాయకుల జీవితాలు మారిపోయాయని, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను బీఆర్ఎస్ నాయకులు అపహాస్యం చేశారని మండిపడ్డారు.ఏమీ చేయకపోయినా ఏ ముఖం పెట్టుకుని దశాబ్ది ఉత్సవాలు,కాలువ పండుగలు,చెరువు పండగలు చేస్తున్నారని, నీళ్ల దగ్గరకు వెళ్లడం పసుపు-కుంకుమ,పూలు వేయడం,ఆ నీళ్లు తీసి నెత్తిన చల్లుకోవడం చేస్తున్నారని,ఏం సాధించారని? ఏ నీళ్లు తెచ్చారని? ఇదంతా చేస్తున్నారని ధ్వజమెత్తారు.కేసీఆర్ నీళ్ల పేరుతో చెబుతున్న మోసపూరిత మాటలు ఎవరూ నమ్మడం లేదని, అవి కేసీఆర్ నీళ్లు కాదయ్యా సామీ…అవి ఎస్సారెస్పీ నీళ్లు,కాకతీయ కాలువలో పారుతున్న నీళ్లు.నీళ్లు వృధాగా సముద్రంలోకి పోకుండా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును కట్టి,అక్కడ నుంచి నీళ్లను మిడ్ మానేరుకు తీసుకువచ్చి అక్కడ నుంచి లోయర్ మానేరు,అక్కడనుంచి కాకతీయ కాలువ ద్వారా నీళ్లు వస్తున్నాయన్నారు.

కాంగ్రెస్ నాయకులు కట్టిన ప్రాజెక్టులు,తవ్విన కాలువల ద్వారా నీళ్లు వస్తున్నాయని,నీళ్లు తెచ్చిన కాంగ్రెస్ నాయకులకు దండం పెట్టాల్సింది పోయి,కేసీఆర్ నీళ్లంటూ దుష్ప్రచారం చేస్తున్నారని,ప్రజల్ని ఇంకెంత కాలం మోసం చేస్తూ మభ్య పెడతారని అన్నారు.కాళేశ్వరం అంటే మేడిగడ్డ,అన్నారం, సుందిళ్ల మాత్రమేనని,ఏ మేడిగడ్డ,అన్నారం, సుందిళ్ల నుంచి ఈ సూర్యాపేటకు నీళ్లు ఇచ్చారని,ఏ ఒక్క ఏకరానికైనా అదనంగా మీరు నీళ్లు ఇచ్చారేమో చెప్పాలని డిమాండ్ చేశారు.

జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి,మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమాధానం చెబుతారని అశించానని, వాటికి జవాబులు చెప్పకుండా ఇ్దదరూ వంకర మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.మీరు నడిచి వచ్చిన రోడ్లు వేసింది మేమేనని,మీరు పీల్చే గాలి తెచ్చింది మేమే అంటున్నారని హైదరాబాద్ నుంచి సూర్యాపేట దాకా రోడ్లు వేసింది మీరా?నేను సూటిగా అడుగుతున్నా నీళ్లు తెచ్చారా? డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎన్ని కట్టారు? ఎన్ని ఇచ్చారు ఇంటికో ఉద్యోగం అన్నారు.

ఎంతమందికి ఇచ్చారో సమాధానం చెప్పాలనిఅన్నారు.కాంగ్రెస్ వాళ్లు ఏమి చేశారని అడుగున్న మీరు,అసలు ఈ పదేళ్లలో ఏమి చేశారో చెప్పాలన్నారు.నేను చెబుతున్నా ఈవాళ మీరు జల్లుకుంటున్న నీళ్లు కాంగ్రెస్ తెచ్చింది.నీ కారు వస్తున్న రోడ్డు మేము ఏసిందే.

ఇక్కడ వెలిగే కరెంటు,ఇక్కడ జరుగుతున్న వంద రోజుల పని,ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్య శ్రీ కార్డులు, సూర్యాపేటలో 5 వేల మంది పేదలకు ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్సేనని చెప్పుకొచ్చారు.ఊరూరు పెంచిన బెల్టు షాపులే బీఆర్ఎస్ చేసిన అభివృద్ది అని,తాగండి, ఊగండి అన్నీ అమ్మండి అని చెబుతూ ప్రతి గ్రామంలో మీరు సాధించిన ప్రగతి ఇదేనని అన్నారు.

నువ్వు ప్రాతినిథ్యం వహిస్తున్న నీ జిల్లాలో నువ్వు మొదలు పెట్టిన యాదాద్రి పవర్ ప్రాజెక్టును సైతం పూర్తి చేయలేకపోయావు.మీరు కట్టిన ప్రాజెక్టులు లేవు కానీ,కరెంటు ఇస్తున్నామని ఎలా చెబుతారు?కరెంటు తీసుకురాలేదు,నీళ్లు తీసుకురాలేదు,ఎందు కోసం మీరు పనికి రానప్పుడు మంత్రిగా ఉండడం ఎందుకు?వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.అందులో భాగంగానే ప్రజలు పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ఆదరిస్తున్నారు.పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి బీఆర్ఎస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.

నేను ఇంకా కొన్ని రోజులు సూర్యాపేట జిల్లాలోనే ఉంటాను.నా ప్రశ్నలకు సమాధానం చెప్పవచ్చు.సూర్యాపేటకు వస్తున్న నీళ్లు,మీరు కట్టిన మేడిగడ్డ,అన్నారం, సుందిళ్ల నుంచి వస్తున్నాయా లేక మేము కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వస్తున్నాయా? సూటిగా స్పష్టమైన సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.మేడిగడ్డ,అన్నారం, సుందిళ్లపై మరోసారి పూర్తిగా మీడియాతో మాట్లాడతానని,కేసీఆర్ చేతిలో పడి రాష్ట్రం మొత్తం నలిగిపోతోందని,ధరణి పేరుమీద రైతాంగ సోదరులు భూమిని కోల్పోతున్నారని,అనేక గ్రామాల్లో తక్కువ ధరలకే భూములు అమ్మాలని రైతులను ఒత్తిడి చేస్తున్నారని,అమ్మడానికి ఎవరూ రాకపోతే వాటిని ప్రొబిషన్ కాలంలో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.

రాష్ట్రంలో అతి పెద్ద ల్యాండ్ మాఫియాను నడిపిస్తున్నారని,ఆయనకు తోడుదొంగలా సురేష్ కుమార్ వచ్చారని,ధరణి మాఫియా సూత్రధారి సురేష్ కుమార్ అయితే పాత్రధారి కేసీఆర్ ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube