పాదయాత్రలో ఉద్యోగులకు ఇచ్చిన మాటను ఏపీ సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారు.హామీ ప్రకారం సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తూ ఇటీవల నిర్వహించిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు సీపీఎస్ విధానం రద్దు చేసిన వైసీపీ సర్కార్ జీపీఎస్ కు ఆమోదం తెలిపింది.
వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జీపీఎస్ (గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్) వలన ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి.
సీపీఎస్ కన్నా ఇది మెరుగైన పథకం కావడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఉద్యోగుల భద్రతే ధ్యేయంగా తీసుకువచ్చిన ఈ స్కీం దేశానికి మార్గనిర్దేశంలా నిలువనుంది.
గవర్నమెంట్ ఎంప్లాయిస్ కు పదవీ విరమణ తరువాత వచ్చే 50 శాతం పెన్షన్ కు తగ్గకుండా డీఏ పెరిగే విధంగా కొత్త బిల్లును ప్రభుత్వం రూపొందించింది.ఈ క్రమంలోనే గ్యారెంటెడ్ పెన్షన్ బిల్ -2023 పేరుతో బిల్లు ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
సీపీఎస్ తరహాలోనే ఉద్యోగి పది శాతం ఇస్తే దానికి ఈక్వల్ గా ప్రభుత్వం ఇస్తుంది.రిటైర్ కావడానికి ముందు చివరి వేతనం బేసిక్ లో యాభై శాతం పెన్షన్ గా అందుతుంది.
సీపీఎస్ తో పోలిస్తే జీపీఎస్ ద్వారా అందే పింఛన్ 150 శాతం ఎక్కువని చెప్పొచ్చు.అదేవిధంగా ద్రవ్యోల్బణాన్ని, పెరిగే ధరలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రకటించే డీఏలను పరిగణనలోకి తీసుకుని ఏడాదికి రెండు డీఆర్ లు ఇస్తారు.
అంటే పదవీ విరమణ చేసిన వ్యక్తి తన చివరి నెల బేసిక్ జీతం రూ.లక్ష ఉంటే అందులో రూ.50 వేలు పెన్షన్ గా వస్తుంది.సంవత్సరానికి రెండు డీఆర్ లను కలుపుకుని ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది.
పదవీ విరమణ చేసిన ఉద్యోగి జీవన ప్రమాణాలను రక్షించే విధంగా వారి జీవితాలు సంతోషంగా ఉండే విధంగా జీపీఎస్ లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.ఉద్యోగులకు మంచి చేయాలన్న ఉద్దేశ్యంతో జీపీఎస్ విధానాన్ని తీసుకువచ్చింది ప్రభుత్వం.2070 నాటికి జీపీఎస్ వలన రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన నగదు క్రమంగా పెరిగి అప్పటికి రూ.1,33,506 కోట్లకు చేరనుంది.ఇందులో రూ.1,19,520 కోట్లను బడ్జెట్ నుంచి ప్రభుత్వం భరించాల్సి వస్తుంది.
దీంతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కూడా జగన్ అధ్యక్షతన కేబినెట్ ఆమోదం తెలిపింది.కాగా ఇది జూన్ 2, 2014 నాటికి ఐదేళ్లు సర్వీసు ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరికీ వర్తించనుంది.
ఈ నేపథ్యంలో శాఖల వారీగా ఉద్యోగులను గుర్తించి ఈ ప్రక్రియను అమలు చేయనున్నారు.అయితే రాష్ట్రంలో ఆర్టీసీ, విద్య, వైద్యం వంటి రంగాలలో పెద్ద సంఖ్యలో కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు.
వీరందరి సర్వీస్ రెగ్యులర్ చేస్తూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.