క్షేత్రస్థాయిలో ప్రజా వ్యతిరేకతను తగ్గించుకుని, ప్రజలతో మమేకం అవుతూ, పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) పదే పదే పార్టీ ఎమ్మెల్యేలకు హితబోధ చేస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఇదొక్కటే మార్గమని, ప్రజా వ్యతిరేకత లేకుండా, కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుస్తారు అనుకున్న వారికి టిక్కెట్లు ఇస్తామని, ఎప్పటికప్పుడు సర్వే నివేదిక ద్వారా ఎమ్మెల్యేల పనితీరు తెలుసుకుంటామని, గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటిస్తున్న, కొంతమంది ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు ఆ విషయాన్ని పెడచెవిన పెడుతూ మొదటికే మోసం తెచ్చేలా వ్యవహరిస్తున్న పరిస్థితి ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది.
వివిధ సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తుంటే ,
వారికి సరైన సమాధానం చెప్పకుండా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు( BRS Leaders ) వారిపై ఆగ్రహం ప్రదర్శిస్తూ, విమర్శలు పాలవుతుండడం వంటివి ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి.ఈ వ్యవహారాలపై బీఆర్ఎస్ అధినేత , సీఎం కేసిఆర్ సీరియస్ గా ఉన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నాయకులంతా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రచారం నిర్వహించాలని, ప్రజలకు సంక్షేమ పథకాలు గురించి వివరించాలని, ఎమ్మెల్యేలు నెలలో 21 రోజులు నియోజకవర్గం లో ప్రజలకు అందుబాటులో ఉంటూ, పెండింగ్ పనులను పూర్తి చేసుకోవాలని, ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవాలని కేసిఆర్ సూచించారు.

సక్రమంగా లేని వారికి టిక్కెట్లు ఇచ్చేది లేదని వార్నింగ్ ఇచ్చారు.దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా ప్రజలు గతంలో ఇచ్చిన హామీలపై నిలదీస్తుండడంతో, కొంతమంది వారిపై సీరియస్ అవుతున్నారు.
ఇటీవల తమ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ సమ్మకు దిగిన రేషన్ డీలర్ల పై మంత్రి గంగుల కమలాకర్( Minister Gangula Kamalakar ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.కమిషన్లు చాలవా జీతాలు కావాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం వైరల్ అయింది.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైతు దినోత్సవం లో రుణమాఫీ గురించి ప్రశ్నించిన ఓ రైతుపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు.

రైతుబంధు, పింఛన్లు, ఉచిత కరెంటు ఇస్తున్నాం సిగ్గులేకుండా రుణమాఫీ గురించి ఎలా అడుగుతున్నావ్ అంటూ ఆ రైతుపై కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు విమర్శల పాలయ్యింది.అలాగే మహబూబాబాద్ గోపా తండాలో అభివృద్ధి పనుల పరిశీల నిమిత్తం వచ్చిన డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ను సమస్యలపై ప్రశ్నించిన ఓ వృద్ధురాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆమెకు పింఛన్ నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు.
ఇటువంటి వారు మనకు ఓటు వేయరు, ఇటువంటి వారు ఉన్నా ఒకటే ఊడినా ఒకటే అంటూ ఫైర్ అయ్యారు.ఇదే విధంగా చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజలపై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం వంటివి కెసిఆర్ కు మరింత ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.








