రాష్ట్రావతరణ దినోత్సవం( Telangana Formation Day ) సందర్భంగా తెలంగాణ వాసులకు, దేశవిదేశాలలో స్థిరపడిన,నివాసం ఉంటున్న తెలంగాణ బిడ్డలందరికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.మహానేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు మహోన్నత ఉద్యమాన్ని నడిపి సాధించి పెట్టిన తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దారని,ఇంకా అభివృద్ధి చేస్తున్నారన్నారు.
మన స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి పుణ్యక్షేత్రం,125 అడుగుల బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహం, సచివాలయం, పోలీసు కమాండ్ కంట్రోల్,అమరవీరుల స్మృతి కేంద్రం వంటి అద్భుతమైన నిర్మాణాలు జరిగాయని పేర్కొన్నారు.అలాగే, కేసీఆర్( KCR ) సుపరిపాలనలో విద్యుత్,తాగు, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు.
దండుగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగ చేసి ఆచరణలో నిరూపించి తెలంగాణను దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తీర్చిదిద్దిన మహనీయులు కేసీఆర్ అని కొనియాడారు.పంట పెట్టుబడి కోసం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి 65లక్షల మంది రైతులకు 65,000కోట్లు ఉచితంగా అందించిన విషయాన్ని రవిచంద్ర గుర్తు చేశారు.
ఏటా 13,000 కోట్లు ఖర్చు చేస్తూ సుమారు 46లక్షల మందికి ఆసరా పింఛన్లు అందజేస్తున్నామని చెప్పారు.కొద్దికాలంలోనే అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధి చెందిన తీరు,రాష్ట్రం సుభిక్షంగా వర్థిల్లుతుండడాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు శుక్రవారం నుంచి 21రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకోనున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్ ఎదురులేని మహానాయకులని,కొద్ది నెలల్లో జరగనున్న ఎన్నికలలో బీఆర్ఎస్( BRS ) ఘన విజయం సాధించడం,ఆయన మూడవ సారి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు.రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకులు జరుపుకుంటున్న వేళ తెలంగాణ అమరవీరుల దివ్య స్మృతికి ఎంపీ వద్దిరాజు ఘన నివాళులర్పించారు.







