సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం రసాభసాగా సాగింది.బుధవారం మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపాలిటీ పరిధిలోని నర్సరీల నిర్వహణకు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని, సుందరీకరణ పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించడం,కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ బైరు శైలేందర్ మాట్లాడుతూ 37 వ వార్డులో డ్రెయినేజీల్లో షీల్డ్ తొలగించడం లేదని మున్సిపల్ చైర్ పర్సన్ కు ఫోటోలు చూపించడంతో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఎదురుదాడికి దిగారు.
దీనితో సభలో గందరగోళం నెలకొంది.
పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు సభ నుండి వాకౌట్ చేశారు.
అనంతరం మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణ పరిధిలో నర్సరీల్లో అనేక అవకతవకలు జరిగాయని,మరొక పక్కన పట్టణంలో మెయిన్ రోడ్ల మధ్యలో రోడ్డు పక్కన పెట్టడానికి ఇతర ప్రాంతాల నుండి కోట్లాది రూపాయల వ్యయంతో మొక్కలు తెప్పిస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
సుందరీకరణ పనులకు స్ధానిక నర్సరీల మొక్కలు పనికిరావా అని ప్రశ్నించారు.
మిషన్ భగీరథ నీళ్లు వారానికి రెండుసార్లు మాత్రమే ఇస్తున్నారని అన్నారు.అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే జివో 26 నుండి నిధులు మంజూరు చేయాలని నియమ నిబంధనలు వున్నప్పటికి పలు రకాల పనులకు జివో 26 నుండి నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు.
మున్సిపాలిటీకి స్వంత ట్రాక్టర్లు వున్నప్పటికి గుంతలు తవ్వడానికి 12 లక్షలు ఖర్చు చేయవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.పట్టణంలో కుక్కలు,కోతుల సమస్య పెరిగిందని,మున్సిపాలిటీ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదన్నారు.







