మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) ప్రకటించిన మొదటి మేనిఫెస్టో అలవిగాని హామీలకు నిలయం గా మారింది ….18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామని ,ప్రతి నిరుద్యోగి మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృత్తి గా చెల్లిస్తామని, ఆర్టీసీ బస్సులలో మహిళలకు పూర్తిస్థాయి ఉచిత రవాణా కల్పిస్తామని చేసిన హామీలు అమలు చేస్తే రాష్ట్ర ఖజానాపై పడే భారాన్ని ఆలోచిస్తే ఆర్థిక నిపుణులు సైతం ముక్కు మీద వేలేసు కునే పరిస్థితి.
ఈ రోజుల్లో స్త్రీలు కూడా అనేక ఉద్యోగాలు చేస్తూ తమ కుటుంబానికి ఆధారభూతంగా నిలుస్తున్నారు లక్షల్లో సంపాదించే మహిళలు( women ) కూడా ఉన్నారు.నిజంగా మహిళలకు చేయూతనిచ్చే ఉద్దేశం ఉంటే వారికి వృత్తి విద్యల్లో నైపుణ్యం కలిగించి రుణాలు ఇవ్వడం ద్వారా వారికి ఆర్థిక పరిపుష్టి కలిగించాలి కానీ ఎటువంటి షరతులు నిబంధనలు పెట్టకుండా నెలకి 1500 రూపాయలు ఇస్తామనటం ఖజానాపై పడే భారాన్ని ఊహించుకుంటేనే మాట రాని పరిస్థితి .18 నుంచి 59 సంవత్సరాల స్త్రీల సంఖ్య అంటే కొన్ని కొట్ల మంది ఉంటారు .అలాంటప్పుడు ఖజానా పడే భారాన్ని ఏ విధంగా సర్దుబాటు చేస్తారన్నది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న .

అదే రకంగా నిరుద్యోగ భృతి ( unemployment benefit )కూడా అలవిగాని హామినే ….అర్హతకు సంబంధం లేకపోయినా ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతికే యువకులే తప్ప ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటే రోజులు గడిచే పరిస్థితి ఇప్పుడు ఎక్కడా లేదు అలాంటప్పుడు నిరుద్యోగులను ఏ రకంగా నిర్వచిస్తారో చెప్పడం కష్టం.వాస్తవ చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగాలనూ పెద్ద స్థాయిలో ఇవ్వటం కూడా కష్టమే.కాబట్టి ప్రైవేటు రంగాలలో వారి నైపుణ్యాలను మెరుగు పెట్టి వారి ఉద్యోగ అవకాశాలను పెంచితే ఆటోమేటిక్ గాని వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది .అలాకాకుండా నిరుద్యోగ భృతి పేరుతో ఖజానాను పంచిపెడితే ,ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వెళ్తుంది.ఒకప్పుడు వైసిపి ఇచ్చిన నవరత్నాల హామీలను విపరీతంగా విమర్శించిన తెలుగుదేశం పార్టీ వీటిని అమలు చేయాలంటే కొన్ని లక్షల కోట్లు కావాలని, దానికి రాష్ట్ర బడ్జెట్ కాక దేశ బడ్జెట్ కూడా సరిపోదు అంటూ అనేక విమర్శలు చేశారు .వాస్తవంలో కూడా వైసీపీ పార్టీ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంపై విపరీతమైన భారం పడి ఆర్థికంగా రాష్ట్రం సతమతమవుతుంది .అయినప్పటికీ ప్రజలకు ఆ భారం తెలియకుండా మేనేజ్ చేస్తున్న వైసిపి ప్రభుత్వం ఎక్కువ కాలం మేనేజ్ చేయలేదని కూడా ఆర్థిక విశ్లేషణలు వస్తున్నాయి.అలాంటప్పుడు ఏ విమర్శలు అయితే తాము వైసిపి ప్రభుత్వం మీద చేశారో ఇప్పుడు అలాంటి హామీలనే ప్రజలకు ఇచ్చి అధికారం లోకి రావాలనుకోవడం పై తెలుగుదేశం పార్టీ విశ్వసనీయతను ప్రశ్నించేలా చేస్తుంది.

అయితే తన సంక్షేమ పథకాలలో ప్రజలలో ప్రత్యేక ఓట్ బ్యాంక్( Vote Bank ) తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్న ఫార్ములానే ఉపయోగించాలని ఆలోచిస్తున్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వాటి సంగతి చూసుకోవచ్చులే అన్న ఆలోచనతోనే ఇలాంటి హామీలను ఇచ్చినట్లుగా తెలుస్తోంది.ఏది ఏమైనా రాజకీయ అధికారమే పరమావధిగా ఆలోచిస్తున్నప్రస్తుత రాజకీయ పార్టీలు రాష్ట్ర భవిష్యత్తుకు గండికోడుతున్నాయని మాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చు.







