సూర్యాపేట జిల్లా: 1969 తెలంగాణ ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సమరయోధులుగా గుర్తించాలని 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చక్రహరి రామరాజు అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని కిరాణా ఫ్యాన్సీ మర్చంట్ అసోసియేషన్ భవనంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 1969 ఉద్యమకారులు ప్రాణాలను ఫణంగా పెట్టి ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు.
జూన్ రెండో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే దశాబ్ది ఉత్సవాల్లో 1969 తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి గౌరవప్రదమైన పెన్షన్ ఇవ్వడంతో పాటు ఉచిత బస్ పాస్,హెల్త్ కార్డ్ అందజేయాలని కోరారు.
తెలంగాణ ఉద్యమకారుల వయసు మీద పడడంతో ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కెసిఆర్ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.సీఎం కేసీఆర్ మరణించిన ఉద్యమ అమరవీరులకు నివాళులర్పించడం ఎంత ముఖ్యమో తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన మమ్మల్ని గుర్తించి ఆదుకోవడం కూడా అంతే ముఖ్యమని కోరారు.
అంతకముందు 1969 తెలంగాణ ఉద్యమకారుల సంఘం సభ్యులు నీలకంఠ చలమంద అనారోగ్యంతో బాధపడుతుండగా అయన నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారాం రెడ్డి,జిల్లా కోశాధికారి చంద్రారెడ్డి,వెంకటయ్య, దేవత్ కిషన్ నాయక్,కొత్త గురువయ్య,కత్తిరేణి వెంకటేశ్వర్లు,నాసిని నర్సింగరావు పాల్గొన్నారు.