కామారెడ్డి జిల్లా( Kamareddy ) ఎల్లారెడ్డిలో ఆస్తి కోసం కన్నతండ్రితో గొడవపడిన కొడుకు చివరికి దారుణ హత్యకు పాల్పడడంతో ఎల్లారెడ్డి పట్టణంలో తీవ్ర కలకలం రేగింది.ప్రస్తుత సమాజంలో డబ్బుకు ఉన్న విలువ మానవత్వానికి లేదు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.
ఆస్తిపాస్తుల ముందు మానవ సంబంధాలు మంటలో కలిసిపోతున్నాయి.ఈ హత్య సంఘటన గురించి పూర్తి వివరాలు ఏమిటో చూద్దాం.
ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.ఎల్లారెడ్డి పట్టణంలో జడే తుకారాం (75) ( Jade Tukaram ) అనే వస్త్ర వ్యాపారికి జడే కిషోర్( Jade Kishore ) అనే కుమారుడు సంతానం.
తండ్రీ, కొడుకుల మధ్య ఆస్తి తగాదాల కారణంగా కొడుకు కిషోర్ తన భార్యా పిల్లలతో హైదరాబాదులో ఉంటూ వ్యాపారం చేసుకునేవాడు.కొన్నేళ్ల తర్వాత వ్యాపారంలో నష్టం రావడంతో ఆస్తి కావాలని తండ్రిని కోరాడు.

మళ్లీ తండ్రి, కొడుకుల మధ్య ఆస్తితగాదాలు మొదలయ్యాయి.కొడుకు కిషోర్ ప్రవర్తన పై నమ్మకం లేక ఆదివారం తన ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని తుకారాం గట్టిగా వారించడంతో ఆగ్రహించిన కిషోర్ తండ్రిని గట్టిగా కొట్టడంతో తండ్రి స్పృహ కోల్పోయి కిందపడ్డాడు.వెంటనే అంబులెన్స్ లో తండ్రిని ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకు వెళ్ళగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

మృతదేహాన్ని కిషోర్ ఆస్పత్రి నుండి ఇంటికి తీసుకువచ్చాడు.కానీ తండ్రి, కొడుకుల మధ్య ఉండే ఆస్తి తగాదాల గురించి ఎల్లారెడ్డి పట్టణమంతా వ్యాపించడం, తుకారాం ముఖంపై గాయాలు ఉండడంతో హత్య జరిగి ఉండవచ్చు అనే ప్రచారం చివరికి పోలీసులకు చేరింది.పోలీసులు డాగ్ ఫోర్స్ తీసుకురాగా అవి కొడుకు కిషోర్ వద్దకు వెళ్లి ఆగిపోవడంతో అతనిపై అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేశారు.
దీంతో తుకారాం ది సహజ మరణం కాదని, ఆస్తి కోసం కన్న తండ్రిని తానే హత్య చేశానని కిషోర్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
హత్య జరిగిన ఆరు గంటల్లోనే హత్య కేసును చేదించిన సీఐ, ఎస్ఐ, సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాస్ అభినందించారు.







