ఆలు లేదు సులు లేదు కొడుకు పేరు సోమలింగం .అన్న సామెత మాదిరిగా తయారైంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ .
అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేకపోయినా, అధికారంలోకి వచ్చేందుకు పార్టీ నాయకులంతా సమిష్టిగా పనిచేస్తూ ముందుకు వెళ్లాల్సి ఉన్నా, ఎప్పుడూ ఏదో ఒక అంశంపై పార్టీ సీనియర్ నాయకుల మధ్య వివాదాలు ఏర్పడుతూనే వస్తున్నాయి. అసలు పార్టీని జనాల్లోకి తీసుకువెళ్లే విషయం కంటే , ఆధిపత్య ధోరణితో పార్టీలోని నాయకుల పైనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తెలంగాణ కాంగ్రెస్ లో పరిపాటిగా మారిపోయింది .తాజాగా కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి(Renuka Chowdhury ) చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలనే అంశంపై గత కొద్దిరోజులుగా పార్టీలో తీవ్ర చర్చ జరుగుతుంది .

ఈ అంశాలను ప్రస్తావిస్తూ రేణుక చౌదరి కొంతమంది సీనియర్ నాయకులను టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. సీఎం రేసులో భట్టి విక్రమార్క( Mallu Bhatti Vikramarka ) ఒక్కరే లేరని , కాంగ్రెస్ లో ప్రతి కార్యకర్త సీఎం క్యాండిడేట్ అని రేణుక అన్నారు.ఈ సందర్భంగా భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన రేణుక ఫైర్ అయ్యారు. వెంకటరెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నాడని, ఆయన ఏమంటున్నారో ఆయనకే తెలియదని విమర్శించారు.
దళిత సీఎం విషయంలో ఆయన జోస్యం చెప్పినంత మాత్రాన అదే నిజమని ఎట్లా అనుకుంటారని రేణుక ప్రశ్నించారు. దళిత సీఎం అనేది ఇవాళ వీళ్లు అంటున్నారని , నిజానికి దళితుల కోసం కాంగ్రెస్ పార్టీనే ఎంతో చేసిందని రేణుక అన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 ఎమ్మెల్యే స్థానాల్లో ఐదు ఎస్టిలకు , మిగతా 5లో 3 ఎస్సీలకు పోరాడి తీసుకువచ్చింది తానేనని చెప్పారు.బీఆర్ ఎస్ , బిజెపి నిర్వహించిన సర్వేల్లో కూడా కాంగ్రెస్ దే విజయం అని తేలిందని , తనపై అనవసర కేసులు పెడుతున్నారని , ఒక్కసారి తన మూడ్ మారితే ఆ బ్రహ్మదేవుడు కూడా తనను ఆపలేడని రేణుక చౌదరి హెచ్చరించారు.

కొద్ది రోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy )ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో రేణుక చౌదరి నాయకత్వంలో జిల్లాలోని పది స్థానాలను గెలుచుకుంటామని చెప్పడంపై భట్టి విక్రమార్క వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే రేణుక చౌదరి ఈ విధంగా భట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులను టార్గెట్ చేసుకోవడం చర్చనీయాంశం గా మారింది.రేవంత్ రెడ్డే ఈ విధంగా రేణుక చౌదరి ద్వారా విమర్శలు చేయిస్తున్నారనే అనుమానాలు ఇప్పుడు పార్టీలో మొదలయ్యాయి.







