గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ, సందర్భం వచ్చినప్పుడల్లా ఆ పార్టీ పైన, అధినేత కేసిఆర్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Former MP Ponguleti Srinivas Reddy ) , అలాగే ఇటీవల బీ ఆర్ ఎస్ పై ఇటీవల కాలంలో విమర్శలతో విరుచుకుపడుతూ వస్తున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు( Former Minister Jupalli Krishna Rao ) ఇద్దరినీ బీఆర్ఎస్ అధిష్టానం తాజాగా సస్పెండ్ చేసింది.దీంతో తెలంగాణ రాజకీయాలు కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది.
బి.ఆర్.ఎస్ అధిష్టానం తమను సస్పెండ్ చేసిన తర్వాత జూపల్లి, పొంగులేటి మీడియా సమావేశం నిర్వహించి కెసిఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇది ఎలా ఉంటే ఎప్పటి నుంచో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత పార్టీ పెడతారని ప్రచారం జరుగుతుంది.
దీనికి తగ్గట్లుగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఆత్మీయ సమ్మేళనాలు ఆయన నిర్వహిస్తున్నారు .

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తన అనుచరులు పోటీ చేస్తారని పొంగులేటి ప్రకటిస్తూ వస్తున్నారు.సరిగ్గా అదే సమయంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తోనూ, వైఎస్ విజయలక్ష్మితోను పొంగులేటి భేటీ కావడంతో షర్మిల( Sharmila ) పార్టీలో ఆయన చేరుతారనే ప్రచారం జరిగింది .ఈ వ్యవహారంపై పొంగులేటి క్లారిటీ కూడా ఇచ్చారు. తాను జాతీయ పార్టీలోనే చేరబోతున్నట్లు ప్రకటించారు.అయితే ఆయన బీజేపీలోకి వెళ్తారా లేక కాంగ్రెస్ లో చేరుతారా అనే ఉత్కంఠ కొనసాగుతూ వుండగానే బిజెపి కీలక నేతలు రంగంలోకి దిగారు .ఈ మేరకు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ( DK Aruna ), తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోను, జూపల్లి కృష్ణారావుతోను ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది.తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వం అని , రాబోయే రోజుల్లో తగిన ప్రాధాన్యం తప్పకుండా కల్పిస్తామని, వెంటనే బిజెపిలో చేరాల్సిందిగా వారు హామీ ఇచ్చినట్లు సమాచారం.

ఇప్పటికే బీజేపీ అగ్ర నాయకులను ఢిల్లీలో రహస్యంగా కలిసి వచ్చిన పొంగులేటి అప్పట్లోనే బిజెపిలో ( BJP )చేరతారనే ప్రచారం జరిగినా, సొంత పార్టీ పెట్టె ఆలోచనతో ఆయన సైలెంట్ అయిపోయారు. బీఆర్ఎస్ పేరుతో తెలంగాణ రైతు సమితి పార్టీని పొంగులేటి స్థాపిస్తున్నారని ప్రచారం జరిగినా, ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో సొంత పార్టీ పెట్టే కంటే, బిజెపిలో చేరడమే మంచిదనే ఉద్దేశంతో పొంగులేటి ఉన్నారట.ఆయన బాటలోనే జూపల్లి నడవనున్నారట.







