ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఫలితాలు వెలుపడ్డాయి.పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో మూడు స్థానాలలోనూ వైసిపి ఓటమి చెందింది .
అంతే కాదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడు స్థానాలకు గాను ఆరు స్థానాలను వైసీపీ ( YCP )దక్కించుకుంది.మిగతా ఒక్క స్థానంలోనూ వైసీపీ ఎమ్మెల్యేల ఓట్లతో టిడిపి( TDP ) అభ్యర్థి పంచుమర్తి అనురాధ( Panchumurti Anuradha) గెలుపొందారు.
ఈ వ్యవహారం అధికార పార్టీ వైసీపీలో పెద్ద దుమారం రేపింది క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది.ఇక ఈ ఓటమిని వైసీపీ సీరియస్ గానే విశ్లేషించుకుంది.
తమకు దక్కాల్సిన స్థానం టిడిపికి దక్కడంపై తీవ్ర అసంతృప్తి కనిపించింది.అయితే ఆ ఓటమి పై వైసీపీ కేడర్లు మాత్రం ఉత్సాహం కనిపిస్తోంది.

2019 నుంచి చూసుకుంటే వైసీపీకి ఎదురుగాలి లేదు.151 ఎమ్మెల్యేలతో వైసిపి ప్రభుత్వం ఏర్పడింది.ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.దీంతో పాటు స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ జెండా రెపరెపలాడింది.కానీ అనూహ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి చవి చూడడంతో ఈ విషయాన్ని ఇప్పుడు వైసీపీ హై కమాండ్ సీరియస్ గానే తీసుకుంది.ఈ వ్యవహారంలో జగన్ సీరియస్ గా వ్యవహరిస్తారని, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తారని , ఇప్పటివరకు సరిగా ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వని జగన్ ఇప్పుడు వారికి ప్రాధాన్యం ఇస్తారని, క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి విబజన సమస్యలను పరిష్కరిస్తారని, రాబోయే ఎన్నికల్లో గెలుపు పై అతి ధీమాను విడిచిపెట్టి వాస్తవ పరిస్థితులను అంచనా వేసి, దానికి అనుగుణంగా జనసేన , టీడీపీ , బీజేపీలను ఎదుర్కొనేందుకు జగన్ జాగ్రత్తలు తీసుకుంటారని కిందిస్థాయి వైసిపి నాయకులు అభిప్రాయపడుతున్నారు.

అంతేకాకుండా ప్రస్తుతం టిడిపి గెలుపు మూడ్ లో ఉండడంతో , తాము పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్న జనసేన పైన అహంకార పూరిత విమర్శలు టిడిపి నాయకులు చేస్తున్నారు.జనసేన కు 20 సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయించినా, వారు 70 సీట్ల వరకు కోరుకుంటున్నారని, అసలు జనసేన అవసరమే తమకు లేదని, టిడిపి సొంతంగా పోటీ చేసి అధికారంలోకి వస్తుందని, ఇచ్చినన్ని సీట్లు తీసుకుంటే సరే, లేదంటే పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని టిడిపి నేతలు కొంతమంది బహిరంగంగా వ్యాఖ్యానిస్తూ సోషల్ మీడియాలోనూ పోస్ట్లు పెడుతుండడంపై జనసేన సీరియస్ గా ఉంది .తాము ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందినా తమకు జరిగే నష్టం పెద్దగా లేదని , కానీ టిడిపి అధికారంలోకి ఈసారి రాకపోతే ఆ పార్టీ కనుమరుగు అవుతుందని హెచ్చరికలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వైసీపీ మరింత అలెర్ట్ కాగా, టీడీపీ జనసేన మధ్య దూరం పెరగడానికి కారణం అయ్యిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.







