ఇండియన్-అమెరికన్ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి నిక్కీ హేలీ 2024లో తాను అధికారంలోకి వస్తే చైనా, పాకిస్తాన్, ఇరాక్ వంటి దేశాలకు విదేశీ సహాయాన్ని పూర్తిగా నిలిపివేస్తానని హామీ ఇచ్చారు.బలమైన, గర్వించదగిన అమెరికా చెడ్డ వ్యక్తులకు డబ్బు సహాయం అందించకూడదని హేలీ పేర్కొన్నారు.
లేదా పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేయకూడదన్నారు.శత్రువులను ఎదిరించి, స్నేహితుల పక్షాన నిలబడే నాయకులు మాత్రమే అమెరికా విశ్వాసానికి అర్హులని ఆమె అభిప్రాయపడ్డారు.

కనీసం డజను తీవ్రవాద సంస్థలను కలిగి ఉన్న పాకిస్థాన్‌కు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సర్కార్ సైనిక సహాయాన్ని తిరిగి ప్రారంభించిందని హేలీ పేర్కొన్నారు.చైనాకు భారీగా రుణపడి ఉన్న, ఉగ్రవాదులున్న పాక్‌కి డబ్బులు అందించడం అనవసరం అన్నట్లు ఆమె మాట్లాడారు.అమెరికన్ పన్ను చెల్లింపుదారులు తమ డబ్బు ఎక్కడికి వెళుతుందో, అది ఏమి చేస్తుందో తెలుసుకోవడానికి అర్హులని ఆమె నొక్కి వక్కాణించారు.విదేశీ సహాయంలో ఎక్కువ భాగం అమెరికన్ వ్యతిరేక కారణాలకు నిధులు సమకూరుస్తుందని తెలుసుకుంటే వారు షాక్ కావడం ఖాయమన్నారు.
అధ్యక్షురాలిగా ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేస్తానని హేలీ ప్రామిస్ చేశారు.

హేలీ ప్రకారం, యునైటెడ్ స్టేట్స్ గత సంవత్సరంలో విదేశీ సహాయం కోసం 46 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.ఇలా వందల కోట్ల డాలర్లు ఖర్చు చేయడానికి బదులుగా విదేశాంగ విధానంలో తెలివిగా, బలంగా ఉండాలని ఆమె అన్నారు.రష్యా, చైనాతో స్నేహపూర్వకంగా ఉన్న దేశాలకు సహాయం చేయడం మానేయాలని కోరారు.
అమెరికాను ద్వేషించే దేశాలకు విదేశీ సాయాన్ని నిలిపివేయడం వల్ల దేశం మరింత బలంగా మారుతుందని హేలీ అభిప్రాయపడ్డారు.







