వ్యవసాయ రంగంలో మొక్కలకు అవసరమైన పోషకాలలో గంధకం కీలక పాత్ర పోషిస్తుంది.నత్రజని, భాస్వరం, పొటాష్ ల తర్వాత నాలుగో స్థానంలో ఈ గంధకం ఉంటుంది.
మొక్కలు గంధకాన్ని రెండు రూపాయలలో గ్రహిస్తాయి.నేలలో ఉండే గంధకాన్ని వేర్ల ద్వారా సల్ఫేట్ రూపంలో గ్రహిస్తాయి.
వాతావరణం లో అయితే ఆకుల ద్వారా సల్ఫర్ ఆక్సైడ్ రూపంలో గ్రహిస్తాయి.పంట మార్పిడి చేయని పొలాల్లో, గింజలు నూనె గింజలు, పప్పు ధాన్యాల పంట పొలాల్లో, అధిక వర్షపాతం ఉన్న నేలల్లో, సేంద్రీయ పోషకాలు తక్కువగా ఉండే నేలల్లో గంధక లోపం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

గంధకం యొక్క పనితీరు ఏమిటంటే కిరణజన్య సంయోగ క్రియ సక్రమంగా జరగడానికి దోహదపడుతుంది.ఆ సమయంలో సూక్ష్మజీవుల చర్య శక్తివంతంగా ఉండడానికి నత్రజనిని స్థిరీకరింపజేసి సక్రమంగా కిరణజన్య సంయోగ క్రియ జరిగేలా చేస్తుంది.గంధక లోపం లేకపోతే పశువుల మేతకు ఉపయోగపడే జొన్న లాంటి పంటలలో విష తీవ్రత తగ్గుతుంది.కొబ్బరి, పొగాకు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చెరుకు పంటలలో నాణ్యతను పెంచుతుంది.
కూరగాయ పంటలలో పోషకాల విలువను పెంచుతుంది.నూనె గింజల పైర్లలో నూనె శాతం, మాంసకృతులు, నూనె తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది.
వెల్లుల్లి, నీరుల్లి లో ఘాటుకు ప్రధాన కారణం ఈ గంధకం.ఒక రకంగా చెప్పాలంటే ఏ పంటలోనైనా విటమిన్లు, మాంసకృతులు సమృద్ధిగా ఉండాలంటే అందుకు గంధకం అవసరం.

మొక్కల యొక్క లేత ఆకులు లేత పసుపు రంగులోకి మారితే గంధకం లోపం ఉన్నట్లు గుర్తించుకోవాలి.ముదురాకులో పసుపు రంగు లక్షణాలు కనిపిస్తే నత్రజని లోపం.వీటి లోపాల వల్ల ఆకులు మందంగా ఉండి కాండం సన్నంగా ఉండి మొక్కలు పెరుగుదల సరిగా ఉండదు.అమోనియం సల్ఫేట్, అమోనియం ఫాస్పేట్ సల్ఫేట్ ,ఐరన్ సల్ఫేట్, జింక్ సల్ఫేట్, పొటాషియం సల్ఫేట్, సింగిల్ సూపర్ ఫాస్పేట్, జిప్సం, సల్ఫర్ మూలకం లను క్రమ పద్ధతిలో వాడడం ద్వారా గంధక లోపం నివారించుకుని, పోషక విలువలు కలిగిన పంట దిగుబడి పొందవచ్చు.







