ఏపీ అధికార పార్టీ వైసిపి లో అంతర్గత పోరు తీవ్రంగా కనిపిస్తోంది.ఆ పార్టీలో జగన్ కు వీర విధేయుడుగా ఉన్న నాయకులు సైతం ఇప్పుడు గొంతు పెంచుతుండడం ఆందోళన కలిగిస్తుంది.
ఒకవైపు ప్రజా వ్యతిరేకత పెరుగుతుందనే సంకేతాలు, విపక్ష పార్టీలన్నీ ఏకమై 2024 ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు సిద్ధమవుతుండడం ఇప్పుడు సొంత పార్టీలోనే నాయకులు తమ అసంతృప్తిని బహిరంగంగా వెళ్ళగక్కుతూ, పార్టీ పైన, తన పైన ప్రత్యక్షంగాను, పరోక్షంగాను విమర్శలు చేస్తుండడం వంటివి జగన్ కు టెన్షన్ పుట్టిస్తున్నాయి.ఇప్పటికే నరసాపురం వైసీపీ ఎంపీ రఘురాం కృష్ణంరాజు రెబల్ గా మారి తరచూ పార్టీపై విమర్శలు చేస్తుండగా, తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి జగన్ పైన, ప్రభుత్వం పైన విమర్శలు చేయడంతో ఆయనను వెంటనే పక్కన పెట్టారు.
ఇక జగన్ కు వీర విధేయుడుగా మొదటి నుంచి పార్టీలో ఉంటూ, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ, టిడిపి అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కోసం లాఠీ దెబ్బలు తినడమే కాకుండా, జైలుకు వెళ్లి వైసీపీని కాపాడుకుంటూ వచ్చిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు పరోక్షంగా తమ సొంత ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, నియోజకవర్గంలో తమ పనులు ఏమి జరగడంలేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోతున్నామంటూ గతంలో ఆయన విమర్శలు చేశారు.
ఇక ఆ తర్వాత నేరుగా జగన్ శ్రీధర్ రెడ్డిని పిలిపించి ఆయనను బుజ్జగించారు.

ఆ తర్వాత పరిస్థితి చక్కబడుతుందని అంతా భావించినా, తాజాగా మరోసారి ఆయన తెరపైకి వచ్చారు.తనపై నిఘా పెట్టారని, తన ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.తన ఫోన్ ని ట్యాప్ చేయాలని చూస్తే కుదిరే వ్యవహారం కాదని, తన వద్ద డజన్ల కొద్ది సిమ్ లు, ఫోన్లు ఉన్నాయని శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాను ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకున్నానని, తన ఫోన్లు టాప్ అవుతున్న సంగతి తెలిసే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి ముగిస్తున్నాను అని శ్రీధర్ రెడ్డి చెప్పుకొచ్చారు.ఈ వ్యాఖ్యల ద్వారా తన ఫోన్లు టైపింగ్ చేస్తూ తనపై జగన్ పెట్టించారని, పరోక్షంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది.

వైసీపీకి గట్టి పట్టు ఉన్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సొంత పార్టీలోని నాయకులు అసంతృప్తికి గురవుతున్న వంటి సంఘటనలు వైసీపీలో చర్చనీయాంశంగా మారాయి.ఈ జిల్లాలో 2019లో వైసిపి క్లీన్ స్వీప్ చేసింది.ఇప్పుడు పరిస్థితులు అంత అనుకూలంగా లేనట్టుగా నే కనిపిస్తోంది.







