రాబోయే సార్వత్రికల్లో ఏపీలో కచ్చితంగా టిడిపి గెలిచి తీరాలని , ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఉన్నారు.అందుకే నిత్యం ప్రజల్లో ఉంటూ , పార్టీ శ్రేణులను యాక్టివ్ చేసే పనిలో ఉన్నారు.ఇక రాబోయే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు విషయంలోనూ బాబు చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నారు.2019 మాదిరిగా ఎటువంటి మొహమాటలకు వెళ్లకుండా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలోనే పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్న చాలామంది ప్రజల్లో బలం కోల్పోవడంతో అటువంటివారిని ఈ ఎన్నికల్లో పక్కన పెట్టాలని బాబు నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైన కచ్చితంగా గెలుస్తారనుకున్న వారికి టిక్కెట్ ఇవ్వాలని, అనవసర మొహమాటలకు వెళ్లకుండా టికెట్లు కేటాయింపు చేపట్టాలని నిర్ణయించుకున్నారట.
బాబు తాజాగా తీసుకున్న నిర్ణయంతో చాలామంది సీనియర్ నాయకులు రాజకీయంగా ప్రభావం కోల్పోయే అవకాశం కనిపిస్తోంది.వీరితోపాటు వైసీపీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడంలో కానీ , పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గాని విఫలమవుతున్న నాయకులను పక్కన పెట్టాలని భావిస్తున్నారట.
ఎక్కువగా యువ నాయకులకు పెద్దపీట వేయడం ద్వారా పార్టీలో ఉత్సాహం తీసుకురావచ్చు అని, కచ్చితంగా టిడిపి అధికారంలోకి వస్తుందని బాబు బలంగా నమ్ముతున్నారు.

టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కుటుంబాన్ని అలాగే ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు, శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న కళా వెంకట్రావు తో పాటు ఎంతోమంది సీనియర్లకు ఈసారి అవకాశం ఇచ్చేందుకు బాబు ఇష్టపడడం లేదట.మొహమాటల కారణంగా టిక్కెట్లు కేటాయింపు చేపడితే , అది పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తుందని , అలాకాకుండా గెలుపు గుర్రాలకు టికెట్ ఇస్తే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్లకు నామినేటెడ్ పదవులు ఇచ్చి వారి సీనియారిటీని గౌరవించాలని, ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం వారిని దూరంగా పెట్టాలని బాబు నిర్ణయించుకున్నారట.రాబోయే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలంటూ ఇప్పటికే చాలామంది సీనియర్ నాయకులకు, ప్రజాబలం కోల్పోయిన కీలక నేతలకు బాబు నేరుగానే విషయం చెప్పేసారట.







