గత కొన్ని సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు అదేపనిగా రీసెర్చ్ చేస్తున్న ప్రధాన అంశం రోబోటిక్స్. అవును, నేటి దైనందిత జీవితంలో ప్రజల అవసరాల నిమిత్తం రోబోస్ అవసరం ఎంతైనా ఉందని వాటిపైన పరిశోధకులు అనేక పరిశోధనలు చేస్తుండటం మనం చూడవచ్చు.
ఈ క్రమంలో అనేక సినిమాలు కూడా రోబోటిక్స్ పైన రావడం మనకు తెలిసినదే.అదే సమయంలో మానవ నాగరికతను ఈ రోబోలు శాసిస్తాయేమోనన్న భయం కూడా మనుషులకు వుంది అనేది నగ్న సత్యం.
అయితే ఇదే సమయంలో నిర్మాణాత్మక పనుల్లో సహకరించే ఒక కార్మికుని రీతి రోబోను తయారు చేయడం విశేషం.
విషయం ఏమంటే బ్రిడ్జిలు, బహుళ అంతస్థుల భవనాలు, తదితర భారీ నిర్మాణాలలో సాధారణంగా కూలీలు ఏ పని చేసినా ప్రమాదం వారి చెంతనే ఉంటుంది.
కాగా ఇలాంటి పనులు చేయడానికి తగిన రోబో డాగ్ ను కొరియా అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థకు చెందిన పరిశోధకులు తయారు చేయడం విశేషం.దీనిని మాగ్నెటికల్లీ ఎడెసివ్ రోబోట్ ఫర్ వెర్సటైల్ అండ్ ఎక్స్‌పీడియస్ లోకోమోషన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుపరిచే విధంగా మార్వెల్ (MARWEL) అని పేరు పెట్టారు.
ఇది ఇంచుమించుగా ఒక పెంపుడు కుక్క మాదిరి ఉంటుంది.దీనికి నాలుగు కాళ్లు , మొండెం ఎలెక్ట్రానిక్స్ పరికరాలతో అమర్చగా, పాదాలు మాత్రం అయస్కాంత మెత్తలతో తయారు చేయబడ్డాయి.ఈ రోబో డాగ్ గోడలు, భవనాల పైకప్పులు సులువుగా ఎక్క గలుగుతుంది.సెకండుకు 1.6 అడుగుల వంతున గోడలను ఎక్క గలిగితే, సెకండుకు 2 అడుగుల వంతున పైకప్పులు ఎక్కగలదు.బహుముఖ చలన సామర్థం కలిగి ఉన్నందున చకచకా నడిచి పనులన్నీ చేయగలుగుతుంది.4 పౌండ్ల బరువుతో గోడలు పట్టుకుని ఎక్కగలుగుతుంది.పైకప్పు ఎక్కుతున్నప్పుడు తొండ మాదిరి దీని కదలిక ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.