తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో షర్మిల పార్టీ స్థాపించి చాలా కాలం అయినా, ఆ పార్టీలోకి ఆశించిన స్థాయిలో చేరికలు కనిపించలేదు.ఇక ఆ పార్టీ గురించిన చర్చ పెద్దగా లేకపోవడంతో, 2023 ఎన్నికల్లో షర్మిల పార్టీ ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుందని, అంతా అంచనా వేశారు.
ఇక షర్మిల పార్టీ ప్రభావం ఏమాత్రం ఉండదని, అందరూ అంచనాకు వచ్చేగా, ఇటీవల షర్మిల వార్తల్లోకి ఎక్కారు.తాను చేపట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో షర్మిల ఆందోళన చేయడం, అక్కడ తోపులాట జరగడం, షర్మిలకు గాయాలవ్వడం, ఆ తర్వాత షర్మిల కాన్వాయ్ లోని వాహనానికి టిఆర్ఎస్ కు చెందిన వారిగా చెప్పుకుంటున్న కొంతమంది దాడులకు దిగడం వంటివి జరిగాయి.
ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోది సైతం షర్మిలకు ఫోన్ చేసి పరామర్శించారు.
ఈ వ్యవహారాల తర్వాత షర్మిల పార్టీ ప్రస్తావన తరచుగా వస్తోంది.
గతంతో పోలిస్తే షర్మిల కూడా వరుస వరుసగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ, టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు .ఈ క్రమంలో ఆమె నిరసన దీక్షకు దిగారు.తనపై కావాలని కుట్ర చేస్తున్నారంటూ ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు.తన పాదయాత్రకు అనుమతి ఇచ్చేవరకు మంచినీళ్లు కూడా ముట్టను అంటూ శపథం చేశారు.ఆమె ఇంటి వద్ద దీక్షకు దిగారు.ఈ సందర్భంగా తనకు ఏ పార్టీతోను సంబంధం లేదని ఒట్టేసి చెబుతున్నానంటూ షర్మిల వ్యాఖ్యానించారు.
షర్మిల దీక్షకు ఆమె తల్లి విజయమ్మ కూడా మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా షర్మిల తన ఆవేదనను వెళ్లగక్కారు.
తనకు ఏ పార్టీతోను సంబంధం లేదని , తాను తెలంగాణ ప్రజల కోసమే కొట్లాడుతున్నానని ఇప్పటికే అనేకసార్లు చెప్పానని చెప్పుకొచ్చారు.తనకు ఏ పార్టీతోను ఎటువంటి ఒప్పందాలు లేవని , తన బిడ్డలపై ప్రమాణం చేసి చెబుతున్నానంటూ ఆమె మాట్లాడారు.

తనకు దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో ఉన్న ఏ పార్టీతో కూడా సంబంధం లేదని, బిజెపి – బీఆర్ ఎస్ మధ్య స్నేహం ఉంది అంటూ ఆమె ఆరోపణలు చేశారు.తన పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంతో ఆమె అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి అక్కడే దీక్షకు దిగారు.దీంతో పోలీసులు ఆమెను అక్కడి నుంచి తరలించి లోటస్ పాండ్ కు చేర్చారు.ఇక అక్కడ ఆమె మద్దతు దారులతో దీక్షకు దిగగా , పోలీసులు అడ్డుకోవడం, తొక్కిసలాట జరగడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
తన నివాసంలోనే ఆమె దీక్షకు దిగారు.ఈ సందర్భంగానే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.







