నల్లగొండ జిల్లా:నార్కట్ పల్లి మండలం బాజకుంట గ్రామానికి చెందిన దళిత వికలాంగుడిపై గ్రామ అగ్రకుల సర్పంచ్ చెప్పుతో విచక్షణారహితంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ పీఆర్ పీఎస్ ఆధ్వర్యంలో నార్కేట్‌పల్లి తహసిల్దార్ ఆఫీస్ ముందు బాధితులతో ధర్నా నిర్వహించి,అక్కడే ఉన్న ఆర్డీవోకు మెమోరాండం అందజేశారు.ఈ సందర్భంగా పీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి మాట్లడుతూ అగ్రకుల అహంకారంతో ఓ దళిత వికలాంగుడిని సర్పంచ్ చెప్పుతో కొట్టిన వీడియో ఆధారంగా తక్షణం అతనిపై ఎస్సీ,ఎస్టీ,అత్యాచార నిరోధక చట్టం క్రింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని,గ్రామంలో పోలీస్ పికెట్ ను ఏర్పాటు చేసి దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ కు చెందిన సర్పంచ్ ఈదునూరి సరితా రవీందర్ రెడ్డి మరియు బంధువులు బాజకుంట గ్రామంలో ఈనెల 4 న దళితుడైన వర్కాల సైదులు పైన దాడి చేశారని,తిరిగి శుక్రవారం వికలాంగ దళితుడైన వర్కాల పరశురాములు పైన చెప్పులతో బహిరంగంగా దాడి చేశారని, దళితులపై మాటుకాసి జరుపుతున్న వరుస దాడులపై స్థానిక పోలీసులు వీడియోల ఆధారంగా కేసు నమోదు చేయాలని కోరారు.సర్పంచ్ ను,వారి బంధువులను తక్షణం అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలని,గ్రామ దళితుల రక్షణ కోసం గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని నూనె వెంకట్ స్వామి కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ, దళిత సంఘాల నాయకులు పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్,చిరుమర్తి లింగస్వామి,గోవర్ధన్,నరేష్,మధు తదితరులు పాల్గొన్నారు.