కేంద్ర అధికార పార్టీ బిజెపిపై పోరు మరింత పెంచాలని, ఆ పార్టీ పరువు దేశవ్యాప్తంగా తీయడంతో పాటు, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి మెజార్టీ సీట్లు దక్కకుండా చేయాలని, ఆ పార్టీ అధికారంలోకి రాకుండా చూడడమే తమ ధ్యేయమని కేసీఆర్ పదే పదే చెబుతున్నారు.దీంతో పాటు తెలంగాణ విషయంలో ప్రతి సందర్భంలోనూ కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ప్రకటిస్తుందని, దీనిపై పార్లమెంటు వేదికగానే బిజెపిని నిలదీసి, దీనిపై తీవ్ర చర్చ జరిగేలా చేయాలని టిఆర్ఎస్ ఎంపీలకు కేసిఆర్ సూచించారు .
దీంతో పాటు బీజేపీ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపి భయభ్రాంతులకు గురిచేస్తుండడం , అలాగే కేంద్రం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను, వేధింపు ధోరణి పై ఉభయ సభల్లో నిలదీయాలని, దీనిపై కలిసి వచ్చే ఇతర పార్టీల ఎంపీలతోనూ కలిసి కేంద్రాన్ని ఇరుకుని పెట్టాలని కెసిఆర్ తాజాగా సూచించారు.
అవసరమైతే పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేయడంతో పాటు, బహిష్కరణకు వెనకాడ వద్దంటూ కేసీఆర్ సూచించారు .ఈనెల 7వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో నిన్న రాత్రి కేసీఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. దీనికి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , పార్లమెంటరీ పక్ష నేత కేశవరావు, లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు తో పాటు ఇతర ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు వెళుతూ ఉండడంతో కేంద్రం దానిపై విషం చిమ్ముతోందని, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ప్రోత్సహించకపోగా, వివక్ష చూపిస్తూ వివిధ అంశాలపై టార్గెట్ పెట్టి అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడుతోందని , కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం తెలంగాణకు రావలసిన 40,000 కోట్ల పెట్టుబడి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, ఎమ్మెల్యేల ను కొనుగోలు చేసి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిజెపి కుట్రలు చేస్తుందని, ఈ వ్యవహారాన్ని దేశమంతా తెలియజేయాలని, కేంద్రం చేసిన అన్యాయాలు, బిజెపి హామీల అమలులో వైఫల్యాలు, బిజెపి దివాలా కోరు రాజకీయం తదితర అంశాలపై తీవ్ర స్థాయిలో నిరసన చేయాలని , అవసరమైతే పార్లమెంట్ లో ధర్నాలు, నిరసనలతో కేంద్రం వైఖరి ఎండ కట్టాలని కేసీఆర్ సూచించారు.

అలాగే విపక్షాలే లక్ష్యంగా సిబిఐ, ఐటి వంటి దర్యాప్తు సంస్థల ద్వారా కేంద్రం దాడులకు పాల్పడుతోందని, ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందని, ఇటీవల టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిందని, తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లోనూ విపక్షాలపై బిజెపి ఇదే ఫార్ములాను అమలు చేస్తుందని, ఇక ఆషామాషీగా ఈ వ్యవహారాలపై ఉపేక్షించకూడదని జాతీయస్థాయిలోని వాటిపై పోరాడడం ద్వారా, బిజెపిని ఎదుర్కొనే సత్తా ఉన్న పార్టీగా ప్రత్యేక గుర్తింపు పొందాలని పార్టీ ఎంపీలకు కేసిఆర్ సూచించారు.







