2019 ఎన్నికల సమయంలో వైసిపి అధికారంలోకి వచ్చేందుకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించింది బిజెపి.టిడిపి అధినేత చంద్రబాబుపై ఉన్న వైరంతో ఏపీలో మళ్ళీ టిడిపి అధికారంలోకి రాకుండా చేయాలనే ఉద్దేశంతో జగన్ కు అన్ని విధాలుగా సహకారం అందించారు.
కేంద్రంలో బిజెపి, ఏపీలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వీరి మధ్య సన్నిహిత సంబంధాలే కొనసాగాయి.అయితే గత కొద్ది నెలలుగా వైసిపిని దూరం పెడుతూ, ఆ పార్టీని టార్గెట్ చేసుకున్నట్లుగా వ్యవహరిస్తూ వస్తోంది బిజెపి.
ముఖ్యంగా ఏపీ బీజేపీ నాయకులు జగన్ ను ఆయన ప్రభుత్వాన్ని తిడుతూనే వస్తున్నారు.తమ మిత్రపక్షమైన జనసేన తో కలిసి 2024 ఎన్నికల్లో పోటీకి వెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో బిజెపి నాయకులు ఉన్నారు.
ఏపీ బీజేపీ నాయకులు ఎంతగా విమర్శలు చేస్తున్న , కేంద్ర బీజేపీ పెద్దలతో మాత్రం జగన్ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు.అవసరమైన సందర్భంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ జగన్ తన స్వామి భక్తిని చాటుకుంటున్నారు.
అందుకే ఒకవైపు రాజకీయంగా వైసీపీని విమర్శిస్తున్నా, జగన్ కోరిన కోరికలన్నీ తీరుస్తూ ఆయన పరిపాలనకు అన్ని రకాల గాను కేంద్రం సహకారం అందిస్తూ వస్తోంది.తాజాగా ఏపీకి మరో భారీ ప్రాజెక్టును కేంద్రం మంజూరు చేసింది.1700 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఈ ప్రాజెక్టును జగన్ సొంత జిల్లా కడపకు మంజూరు చేసింది.చాలాకాలంగా పెండింగ్ లో ఉంటూ వచ్చిన రోడ్ల విస్తరణకు సంబంధించిన ప్రాజెక్టు ఇది.దీనికి తాజాగా కేంద్రం ఆమోదం తెలిపింది.ఈ విషయాన్ని కేంద్ర రోడ్లు, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

కేంద్రం తాజాగా ఈ ప్రాజెక్టును మంజూరు చేయడంపై వైసిపి లో ఆనందం కనిపిస్తోంది.కడప నుంచి అన్నమయ్య జిల్లాలోని చిన ఓరంపాడు వరకు జాతీయ రహదారి 716 విస్తరించేందుకు రాష్ట్రం పంపించిన ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది.సుమారు 74 కిలోమీటర్ల పొడవున దీనిని నిర్మించేందుకు 1732.66 కోట్ల రూపాయల వ్యయం కానుంది.కడప జంక్షన్ బైపాస్ రోడ్డు నుంచి చిన ఓరంపాడు వరకు జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించనున్నట్లు నితిన్ గట్కారి తెలిపారు.







