ఏ పార్టీలోనైనా పదవుల కోసం నాయకులు ప్రయత్నాలు చేస్తూ , ఆ పార్టీ అధిష్టానం పై ఒత్తిడి చేస్తూ ఉంటారు.రకరకాల మార్గాల్లో ప్రయత్నాలు చేస్తూ పదవుల కోసం పాకులాడుతూ ఉంటారు.
అయితే దానికి విరుద్ధంగా తెలంగాణ బిజెపిలో పదవులు ఉన్న నాయకులు తమకు ఈ పదవులు వద్దు బాబోయ్ అంటూ రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతుండడం చర్చనీయాంశం గా మారింది.ముఖ్యంగా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత పదవుల విషయంలో నాయకులు ఈ నిర్ణయం తీసుకుంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై ఒత్తిడి పెంచుతున్నారు మరి కొంతమంది అధ్యక్షుడు తీరిపై అసంతృప్తితో ఉన్నారు.
ఇప్పటికే పార్టీని వీడి చాలామంది నాయకులు ఇతర పార్టీలలో చేరిపోగా, మరి కొంతమంది పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు.
ముఖ్యంగా అసెంబ్లీ ఇన్చార్జిలు, కన్వీనర్లుగా పదవులు నిర్వహిస్తున్నవారు తమను తప్పించాల్సిందిగా సంజయ్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు.
అయితే వీరంతా పదవుల్లో ఉండేందుకు ఇష్టపడక పోవడానికి కారణం కూడా ఉంది.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ ఇన్చార్జిలు, కన్వీనర్లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకపోవడంతో , తమను ఆ పదవి నుంచి తప్పిస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఉన్నారట.
ప్రస్తుతం బిజెపి ఆధ్వర్యంలో నడుస్తున్న పార్టీ శిక్షణ తరగతుల సందర్భంగా పదవుల్లో ఉన్న నేతలు ఇదే అంశంపై అధ్యక్షుడిపై ఒత్తిడి పెంచుతున్నారట.
దీంతో ఈ విషయంలో ఏం చేయాలనేది తెలియక బండి సంజయ్ సైతం సందిగ్ధంలో పడ్డారట.ఇప్పటికే పార్టీలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు.అంతే కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారు ఎంతోమంది ఉన్నారు.
చాలామందికి టికెట్ హామీ సైతం ఇచ్చారు.వీరిలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా, మిగిలిన వారు అసంతృప్తి చెందుతారనే భయం ఒకవైపు ఉండగానే, ఇప్పుడు అసెంబ్లీ ఇన్చార్జిలు, కన్వీనర్లు పోటీ చేసేందుకు అవకాశం లేదనే పార్టీ నిర్ణయంతో వీరంతా పదవులకు రాజీనామా చేసిన టికెట్ రేసులో ఉండాలని ప్రయత్నిస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది.
ఈ విషయంలో బిజెపి అధిష్టానం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది.? సంజయ్ కి ఎటువంటి ఆదేశాలు ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.