తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర అధికార పార్టీ బిజెపి ఇప్పుడు చేరికల ద్వారా మరింత బలోపేతం అయ్యి, తెలంగాణ అధికార పార్టీగా ఉన్న టిఆర్ఎస్ ను ఓడించాలని చూస్తోంది.అందరిని ఢిల్లీకి పిలిపించి మరి ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు , అమిత్ షా, జెపి నడ్డా వంటి వారు హితబోధ చేస్తున్నారు.
తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని , వాటిని చేజార్చుకోవద్దని, ఏ చిన్న విషయాన్ని ఆషామాషీగా తీసుకోవద్దని , పార్టీలోకి భారీగా చేరికలు ఉండేలా చూసుకోవాలని బిజెపి పెద్దలు పదే పదే చెబుతున్నారు.అలాగే టిఆర్ఎస్ లోని అసంతృప్త నేతలు ఎవరెవరో గుర్తించి, వారందరినీ పార్టీలోకి తీసుకురావాలని, తెలంగాణ బిజెపి కీలక నేతలకు ఆ పార్టీ అధిష్టానం పెద్దలు సూచించారు.
ఈ తరహా అసంతృప్తి నేతలను ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో వారందరినీ బిజెపిలోకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఇటీవల మునుగోడు నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి ఓటమి చెందడాన్ని కూడా సీరియస్ గానే తీసుకున్నారు కాషాయ పెద్దలు.
ఇప్పటికే హుజూరాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు , మునుగోడు బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారిని ఢిల్లీకి పిలిపించి అనేక రాజకీయ వ్యూహాలపై క్లారిటీ ఇచ్చారు.తెలంగాణలో బిజెపి బలహీనంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి, ఇతర పార్టీలలోని బలమైన నేతలను పార్టీలో చేర్చుకునే వ్యూహానికి తెర తీశారు.
ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.ఇక్కడ వైఎస్ఆర్సిపి నుంచి టిఆర్ఎస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆ పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కడం లేదని చాలా కాలం నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఆర్థికంగా బలమైన , ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బిజెపిలోకి తీసుకొస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని బిజెపి అంచనా వేస్తోంది. బలహీనంగా ఉన్న ఖమ్మం జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు, మాజీ మంత్రి, టిఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించిన తుమ్మల నాగేశ్వరావు ను బిజెపిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.
చాలా కాలంగా తుమ్మల టిఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. 2018 ఎన్నికల్లో తుమ్మల ఓటమి చెందిన తర్వాత ఆయనకు టిఆర్ఎస్ లో ప్రాధాన్యం దక్కడం లేదు.
తాను ఓటమి చెందినా, ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చి మంత్రిని చేస్తారని ఆయన ఆశలు పెట్టుకున్నారు.అయినా కేసీఆర్ పట్టించుకోకపోవడం, తదితర కారణాలతో ఆయన అసంతృప్తి చెందారు.
దీనికి తగ్గట్లుగానే సత్తుపల్లిలో జరిగిన సీఎం కేసీఆర్ కృతజ్ఞత సభకు తుమ్మల గైర్హాజరయ్యారు.అలాగే మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు జలగం వెంకట్రావు ను చేర్చుకోవాలని చూస్తున్నారు.
సత్తుపల్లి కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2018లో కొత్తగూడెం నుంచి రెండోసారి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయారు.

ఇక ఆ తరువాత నుంచి టిఆర్ఎస్ లో అంతగా ప్రాధాన్యం దక్కకపోవడంతో ఆయన చాలాసార్లు టిఆర్ఎస్ తో అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు.ఇప్పుడు ఈయన పైనా బీజేపీ కన్నేసింది.అలాగే మాజీ మంత్రి టిఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించిన జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలలో మంత్రిగాను పనిచేశారు.అలాగే 2014 ,18 మధ్య టిఆర్ఎస్ మంత్రిగా పనిచేశారు.అయితే 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ చేతిలో జూపల్లి ఓటమి చెందారు.ఇక అప్పటి నుంచి పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కకపోవడంతో జూపల్లి అసంతృప్తితో ఉన్నారనే విషయాన్ని గుర్తించిన బిజెపి ఇప్పుడు ఆయనను చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది.

వీరితోపాటు నాలుగు సార్లు తాండూర్ నుంచి గెలిచిన పట్నం మహేందర్ రెడ్డి కూడా టిఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్నారని బిజెపి గుర్తించింది.2018 అసెంబ్లీ ఎన్నికల్లో పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో పట్నం మహేందర్ రెడ్డి ఓటమి చెందారు.ఇప్పుడు ఆయనను చేర్చుకునేందుకు పావులు కలుపుతోంది వీరితో పాటు టిఆర్ఎస్ సీనియర్ నేతగా ఉన్న బాల్కొండ సునీల్ రెడ్డిని చేర్చుకునే ప్రయత్నాలు మొదలయ్యాయట.







