సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని కరివిరాల కొత్తగూడెం గ్రామంలో ఎంసీపీఐయు తుంగతుర్తి డివిజన్ నాయకులు ఈదురి వీరపాపయ్య అధ్యక్షతన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు,మాజీ ఎంపీ భీమిరెడ్డి నర్సింహారెడ్డి శతజయంతి వేడుకలతో పాటు ఎంసీపీఐయు వ్యవస్థాపకులు, మాజీ ఎమ్మెల్యే,అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ 14వ వర్ధంతిని పురస్కరించుకొిని అక్టోబర్ 17 నుండి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా బీసీ కుల గణన జరపాలని,చట్టసభలలో రిజర్వేషన్ చేయాలని డిమాండ్లతో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యాతిథిగా హాజరైన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి గ్రామంలోని కామ్రేడ్ బిఎన్ రెడ్డి విగ్రహానికి,ఓంకార్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాులర్పించారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ దేశంలో అత్యధికంగా వెనకబడిన వర్గాల ప్రజలు పాలకవర్గాలపై సామాజిక న్యాయ పోరాటాలతో ఉద్యమాలు చేసి,చట్ట సభలకు వెళ్లాలని పిలుపునిచ్చారు.75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అత్యధిక శాతంగా ఉన్న బహుజన ప్రజలకు సామాజిక,ఆర్థిక, రాజకీయ న్యాయం జరగట్లేదని,దేశవ్యాప్తంగా వెనుకబడిన సామాజిక వర్గాలలో అన్ని విధాల వివక్షత ఉన్నదని,వారి వారి బీసీ కుల గణన జరిగితే వారు అన్ని విధాల అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయన్నారు.ఇది సామాజిక అంశమని 1986లో ఉమ్మడి రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడు కామ్రేడ్ ఓంకార్ స్పష్టమైన సామాజిక కోణంలో అసెంబ్లీలో విశ్లేషణ చేసి స్థానిక సంస్థలలో 34 శాతం బీసీలకు రిజర్వేషన్లు అయ్యేటట్లు ఆనాడు ప్రభుత్వంతో పోరాడారని గుర్తు చేశారు.
కామ్రేడ్ బి.ఎన్.రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా,మూడుసార్లు ఎంపీగా ఎన్నికై చట్టసభలలో ప్రజల సమస్యల కోసం రామన్నపేట నుండి నడికుడి వరకు రైలు మార్గాన్ని సాధించిన యోధుడని, ప్రజలకు సాగునీరు,త్రాగునీరు అందించాలని,పంట పొలాలు సస్యశ్యామలంగా ఉండాలనే లక్ష్యంతో శ్రీరాంసాగర్ రెండవ దశ కాలువకు కాలువకు 1996 మార్చి 6న ఆనాడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేయించిన ఘనత బిన్ రెడ్డికే దక్కిందని,1997 డిసెంబర్ రెండున సూర్యాపేట జిల్లా కేంద్రంగా సామాజిక న్యాయ సభ జరిపి లక్ష మందిని సమీకరించి సామాజిక న్యాయ రథసారధి బిన్ రెడ్డి అని రవి గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఎంసిపిఐయు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వెంకన్న సామాజిక మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కొత్తగట్టు మల్లయ్య,బహుజన నాయకులు వెంకట యాదవ్,సామాజిక తెలంగాణ రాష్ట్ర నాయకులు పత్యపురం యాదగిరి,ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి షేక్ నజీర్,పార్టీ నాయకులు రమేష్,ఏసబోయిన సుధీర్,వేముల పెద్ద నరసయ్య,ఏపూరి సోమన్న,సంధ్య,సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మన్నూరి నాగేశ్వరరావుతో పాటు మరికొంతమంది పార్టీలో చేరగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాధగోని రవి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో కామ్రేడ్ బి ఎన్ తో పాల్గొన్న స్వతంత్ర సమరయోధులను సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంసిపిఐయు నాయకులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.