మునుగోడు ఎన్నికలు వాడీవేడీగా జరుగుతున్నాయి.ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ప్రచారంలో వేగం పెంచాయి.
ఓటర్లను తమ వైపు ఆకర్షించుకోవడానికి అన్ని పార్టీలైన నాయకులు నానా తంటాలు పడుతున్నారు.మద్యం, మాంసం పంచుతూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు ఊహించని షాక్ ఎదురైంది.మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీ) ఫిర్యాదు వెళ్ళింది.
దీంతో టీఆర్ఎస్‌కు గట్టి ఎదురు దెబ్బె తగిలింది.కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర టీఆర్ఎస్ తీరుపై వ్యతిరేకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు.ఈ ఫిర్యాదు పత్రంలో మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దుర్వినియోగానికి పాల్పడుతోందని పేర్కొన్నారు.
ఎన్నికల నియమావళిని, నిబంధనలను ఉల్లంఘించి ప్రచారాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు.అలాగే ఎన్నికల ప్రక్రియను కట్టుదిట్టం చేయాలని, నకిలీ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేశారు.కాగా, ఇప్పటికే మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా 12 వేల నకిలీ ఓట్లను తొలగించారు.మరో 14 వేల నకిలీ ఓట్లను కూడా తొలగించాలని బీజేపీ నేతలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
అలాగే మునుగోడు ఎన్నికల్లో డబ్బులు, మద్యం విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని, ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ వాహనాలను సైతం ఉపయోగిస్తున్నారని బీజేపీ నేతలు పేర్కొన్నారు.
కాగా, మరో వైపు మునుగోడులో ఎన్నికలు యుద్ధంలా జరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి.సాధారణంగా బైపోల్ ఎలక్షన్స్ అంటే పెద్దగా పట్టించుకోరు.కానీ ఇక్కడ మాత్రం తమ పార్టీ ఖచ్ఛితంగా గెలవాలని ప్రధాన పార్టీలు కసితో పోరాటం చేస్తున్నాయి.
ఇప్పటికే అధికార పార్టీ టీఆర్ఎస్ మంత్రులు మునుగోడులోనే మకాం వేశారు.బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడే తిష్ట వేశారు.అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రచారంలో వేగం పెంచుతున్నారు.ఆయా పార్టీలు తమ తమ మెనిఫెస్టోను తయారు చేసుకుని ప్రచారాలు జరుపుతున్నారు.