వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా గడ్డ మీదకు వెళ్లిన భారతీయులు నేడు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తున్న సంగతి తెలిసిందే.అక్కడి కీలక వ్యవస్థల్లో భారతీయులు మంచి హోదాల్లో పనిచేస్తున్నారు.
రాజకీయ నాయకులు, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలుగా రాణిస్తున్నారు.ఇక అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టాక భారతీయుల ప్రాబల్యం మరింత పెరిగింది.
ఆయన పరిపాలనా యంత్రాంగలో దాదాపు 130 మందికి పైగా ఇండో అమెరికన్లు పలు హోదాల్లో వున్నారు.ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.తాజాగా భారత సంతతికి చెందిన చంద్రు ఆచార్యకు ఫెయిత్ బేస్డ్ సెక్యూరిటీ అడ్వైజరీ కౌన్సిల్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీలో కీలక పదవి దక్కింది.యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన 25 మంది విశిష్ట విశ్వాసపాత్రులైన నాయకులతో కూడిన ఈ కమిటీలో ఆచార్య ఏకైక హిందువు అని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
అమెరికాలోని హిందూ కమ్యూనిటీ, ఇంటర్ ఫెయిత్ ఫోరమ్‌లలో సంభాషణలు, శాంతి కార్యక్రమాల ద్వారా వివిధ విశ్వాస సంఘాల మధ్య వారధిగా ఆచార్య పనిచేశారు.గత రెండు దశాబ్ధాలుగా సామాజిక సమానత్వం కోసం పనిచేస్తున్న సంస్థల కార్యక్రమాల్లో చంద్రు ఆచార్య చురుగ్గా పాల్గొంటున్నారు.
ప్రస్తుతం ఆయన మిచిగాన్‌లోని కాంటన్ టౌన్‌షిప్ ప్లానింగ్ కమీషన్‌లో పనిచేస్తున్నారు.అంతకుముందు మిచిగాన్ ఆసియా పసిఫిక్ అఫైర్స్ కమీషన్‌లో కమీషనర్‌గా పనిచేశారు.

ఇకపోతే… నెదర్లాండ్స్‌లో అమెరికా రాయబారిగా భారత సంతతికి చెందిన షెఫాలీ రజ్దాన్ దుగ్గల్ నియమితులైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో దుగ్గల్ చేత ఇటీవల ప్రమాణ స్వీకారం చేయించారు దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.దీనిపై ఆమె ట్వీట్ చేశారు.నెదర్లాండ్స్‌లో అమెరికా తదుపరి రాయబారిగా షెఫాలీ రజ్దాన్ దుగ్గల్‌తో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం తనకు లభించిందన్నారు.ఈ కొత్త పాత్రలో ఆమెకు అంతా మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు కమలా హారిస్ ట్వీట్‌లో పేర్కొన్నారు.నెదర్లాండ్స్‌లో అమెరికా కొత్త రాయబారిగా షెఫాలీ రజ్దాన్ దుగ్గల్ నియామకాన్ని యూఎస్ సెనేట్ గత నెలలో ఆమోదించిన సంగతి తెలిసిందే.






