2019 ఎన్నికల సమయంలో ఏపీలో హడావుడి చేసిన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అక్కడ అభ్యర్థులను పోటీకి దింపారు.అయినా ప్రయోజనమేమి దక్కలేదు.
ఇక అప్పటి నుంచి సైలెంట్ గానే ఉంటూ వస్తున్న పాల్ గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో హల్చల్ చేస్తున్నారు.ముఖ్యంగా టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని అనేక విమర్శలు చేస్తూ, మీడియా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
తెలంగాణలో ప్రజాశాంతి పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీకి దింపుతామంటూ ప్రకటనలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరఫున గద్దర్ ను పోటీకి దించాలని పాల్ చూసినా… ఆయన ఎన్నికలలో పోటీ చేసేందుకు ముందు అంగీకారం తెలిపినా.
చివరి నిమిషంలో తప్పుకున్నారు.దీంతో తానే ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలని నిర్ణయించుకుని నామినేషన్ కూడా దాఖలు చేశారు .అయితే ఆయన నామినేషన్ ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో, ఎన్నికల అధికారిని కలిసేందుకు చుండూరుకు వచ్చిన పాల్ ఈ సందర్భంగా అక్కడ కనిపించిన బిజెపి హుజురాబాద్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఆసక్తికరమైన సంభాషణ చేశారు.

ఎన్నికల ప్రచారంలో ఉన్న రాజగోపాల్ రెడ్డి వద్దకు వెళ్లిన కేఏ పాల్ ఆయనను ఆలింగనం చేసుకుని రాబోయే ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని, 60 నెలల్లో ఎవరు చేయలేని విధంగా మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని రాజగోపాల్ రెడ్డిని అభ్యర్థించారు.అంతేకాదు కొంత దూరం పాటు బిజెపి నాయకులతో కలిసి కేఏ పాల్ నడుస్తూ ముందుకు వెళ్లారు.పాల్ ను చూసిన బిజెపి కార్యకర్తలు జై బిజెపి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మునుగోడులో తనను గెలిపిస్తే రోల్ మోడల్ గా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పుకొచ్చారు.
టిఆర్ఎస్ , కాంగ్రెస్, బిజెపిలు ఓట్లను కొనుగోలు చేస్తున్నాయని, కులగజ్జి, కుట్రలు, కుతంత్రాలు పోవాలంటే ప్రజాశాంతి పార్టీని గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు.తనకు అవకాశం కల్పిస్తే 6 నెలల్లో 7000 మందికి ఉద్యోగాలు ఇస్తాను అంటూ హామీ ఇచ్చారు.
ఒకప్పుడు అట్టడుగున ఉన్న హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని, మునుగోడును అదే విధంగా అమెరికా చేస్తానంటూ వ్యాఖ్యానించారు.తనకు బీజేపీ అభ్యర్ధిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి మద్దతు ఇవ్వాలంటూ పాల్ కోరారు.