ఎన్నికలు అంటేనే ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.ఒక పార్టీని రాజకీయంగా ఇరుకును పెట్టేందుకు మరో పార్టీ ప్రయత్నిస్తూ ఉంటుంది.
ఈ విమర్శలు, ఆరోపణల వ్యవహారాలు సర్వసాధారణమైనా, ప్రస్తుతం తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా పోస్టర్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి.ఒక పార్టీ అభ్యర్థిని విమర్శించేందుకు వాల్ పోస్టర్స్ వేస్తూ, వారిపై జనాల్లో అనుమానాలు కలిగే విధంగా అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇప్పటికే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఫోన్ పే తరహాలో కాంట్రాక్ట్ పే ద్వారా 18 వేల కోట్లు రాత్రికి రాత్రి జమ అయ్యాయి అంటూ రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన నామినేషన్ వేసిన రోజు రాత్రి పోస్టర్లు వెలియడం సంచలనం రేపింది.
తాజాగా మరోసారి మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ లో పోస్టర్ లు వెలిశాయి.”మునుగోడు ప్రజలారా మేము మోసపోయాం మీరు మోసపోవద్దు ” ఇట్లు దుబ్బాక హుజురాబాద్ ప్రజలు అంటూ పోస్టర్స్ కలకలం సృష్టించాయి.చుండూరులోనూ పోస్టర్స్ వెలిశాయి.
షా ప్రొడక్షన్స్ సమర్పించు ‘ 18 వేల కోట్లు విడుదల ‘ ! దర్శకత్వం కోవర్ట్ రెడ్డి , సత్యనారాయణ 70 ఎం ఎం అంటూ వెలసిన పోస్టర్స్ కలకలం రేపాయి.బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలువడడం కొత్తేమి కాదు.
ఉప ఎన్నికల తంతు మొదలైనప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో ఏదో ఒక ప్రాంతంలో పోస్టర్స్ దర్శనం ఇస్తూనే ఉన్నాయి.
కాంగ్రెస్ కు రాజీనామా చేసి బిజెపి నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీ చేసేందుకు భారీగానే కాంటాక్ట్ లు దక్కాయి అని , అందుకే రాజగోపాల్ రెడ్డి బిజెపి పోటీ చేస్తున్నారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తూనే వస్తున్నారు.ఇప్పుడు ఈ పోస్టర్స్ రాజకీయం మునుగోడులో చర్చనీయంశంగా మారింది.ఇదిలా ఉంటే ఈ ఉప ఎన్నికల్లో పోటీకి ఇప్పటికే భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి.
ఇప్పటి వరకు 129 మంది అభ్యర్థులు పోటీలు ఉన్నారు.ఈరోజు నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు.
ఎల్లుండి ఉపసంహరణకు చివరి తేదీ.ఆ తరువాత పోటీలో ఎంతమంది ఉండబోతున్నారనేది క్లారిటీ రాబోతోంది.