ఒకపక్క మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సందడి తెలంగాణలో బాగా కనిపిస్తోంది.ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని ప్రధాన పార్టీలు భారీగా సొమ్ములు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యాయి .
ఇప్పటికే కొంతమంది ఓటర్లకు అడ్వాన్స్ రూపంలో సొమ్ములు ముట్ట చెబుతున్నట్లుగాను వార్తలు వస్తున్నాయి.గెలుపును అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగానే తీసుకోవడంతో పాటు, రాబోయే ఎన్నికలకు రెఫరెండం గా మునుగోడు ఎన్నికలను అన్ని పార్టీలు చూస్తూ ఉండడంతో, సొమ్ములు ఖర్చు పెట్టేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా కోట్లాది రూపాయల హవాలా సొమ్ము పోలీసులు తనిఖీల్లో దొరుకుతున్నాయి . మూడు రోజుల వ్యవధిలోనే దాదాపు ఏడుకోట్ల రూపాయలకు పైగా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇప్పటి వరకు 10 కోట్ల వరకు సొమ్ములు దొరికినట్లుగా పోలీసులు తెలిపారు .అయితే ఈ సొమ్ములు మొత్తం మునుగోడు ఎన్నికల కోసమే వెళ్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.ముఖ్యంగా జరుగుతున్న హవాలా సొమ్ము బీజేపీ అభ్యర్థికి చెందినది గానే ప్రచారం జరుగుతోంది.బిజెపి అభ్యర్థికి చెందిన సొమ్ములే ఎక్కువగా పట్టుపడుతుండడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పోలీసు వ్యవస్థ టీఆర్ఎస్ ప్రభుత్వ ఆధీనంలో ఉండడంతోనే హవాలా వ్యాపారులపై ప్రత్యేకంగా నిఘా పెట్టి సొమ్ము పంపిణీ అవుతున్న సమయంలో పట్టుకోవడం సాధారణంగా మారిపోయింది.

గతంలోనూ దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో బిజెపి అభ్యర్థికి చెందిన డబ్బు పదేపదే పట్టుబడడంతో తమ ఫోన్లు ట్రాప్ చేస్తున్నారని, అప్పటి బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు విమర్శలు చేశారు.ప్రస్తుతం అదే రకమైన పరిస్థితి ఇప్పుడు నెలకొనడంతో టిఆర్ఎస్ ప్రభుత్వమే బిజెపి నేతల ఫోన్లను ట్రాప్ చేస్తూ, నిఘా పెట్టిందనే అనుమానాలు బిజెపి నేతలు వ్యక్తం చేస్తున్నారు.అయితే పోలీసుల తనిఖీల్లో ఎక్కడా టిఆర్ఎస్ కు చెందిన సొమ్ములు పట్టుబడకపోవడం కేవలం బిజెపి కి చెందిన నాయకుల సొమ్ములే పట్టుబడుతూ ఉండడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది.







