అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కిడ్నాప్‌కు గురైన భారతీయ కుటుంబం కథ విషాదాంతమైన సంగతి తెలిసిందే.దుండగుల చేతిలో అపహరణకు గురైన ఎనిమిది నెలల చిన్నారి సహా ఆమె తల్లిదండ్రులు, వారి సమీప బంధువు ఓ తోటలో శవాలై తేలారు.
ఈ విషయాన్ని కాలిఫోర్నియాలోని మెర్సెడ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ధ్రువీకరించింది.వీరంతా పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లా హర్సీ పిండ్‌కు చెందినవారు.
మృతులు జస్‌దీప్ సింగ్, జస్లీన్ కౌర్, వారి ఎనిమిది నెలల చిన్నారి అరూహి ధేరి , వీరి సమీప బంధువు అమన్‌దీప్ సింగ్‌ల కోసం స్థానికులు ఏకమయ్యారు.వీరి బంధువులు నిర్వహించిన ఫండ్ రైజింగ్‌కు మంచి స్పందన లభిస్తోంది.
గో ఫండ్ మీ ద్వారా ఇప్పటి వరకు 3,00,000 డాలర్ల విరాళాలు లభించినట్లుగా కథనాలు వస్తున్నాయి.
అమన్‌దీప్ సింగ్ భార్య జస్‌ప్రీత్‌కౌర్ మాట్లాడుతూ.
తన భర్త, అతని సోదరుడు 18 ఏళ్లుగా అమెరికాలో వుంటున్నారని తెలిపారు.వీరు కాలిఫోర్నియాలోని వారి కుటుంబాలను మాత్రమే కాకుండా భారతదేశం నుంచి తిరిగి వచ్చిన వారి వృద్ధ తల్లిదండ్రుల ఆలనా పాలనా కూడా చూస్తున్నారని జస్‌ప్రీత్ కౌర్ చెప్పారు.
ఫండ్ రైజింగ్ ద్వారా వచ్చిన నిధులను ఆరూహి నానమ్మ, తాతయ్యలకు.అమన్‌దీప్ సింగ్ భార్య జస్‌ప్రీత్ కౌర్ వారి ఇద్దరు పిల్లలకు ఆసరాగా మారనున్నాయి.
పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాకు చెందిన జస్‌దీప్ సింగ్ కుటుంబం అక్టోబర్ 3న కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీలో కిడ్నాప్‌కు గురైన సంగతి తెలిసిందే.పోలీసులు వీరి ఆచూకీ కోసం గాలిస్తుండగానే.
నలుగురి మృతదేహాలు రెండు రోజుల తర్వాత ఒక తోట వద్ద దొరకడం సంచలనం సృష్టించింది.వీరి సంస్మరణార్ధం స్థానికులు నిర్వహించిన కార్యక్రమం ఆదివారంతో ముగిసింది.
ఈ దారుణానికి పాల్పడిన జీసస్ సల్గాడోను అక్టోబర్ 6న అరెస్ట్ చేశారు.అలాగే నేరపూరిత కుట్ర, సాక్ష్యాధారాలను నాశనం చేసిన ఆరోపణలపై సల్గాడో తమ్ముడు అల్బెర్టో సల్గాడోను పోలీసులు గత శుక్రవారం అరెస్ట్ చేశారు.
అయితే ఇంతటి ఘాతుకానికి దారి తీసిన కారణం ఏంటన్నది మాత్రం స్పష్టంగా తెలియరాలేదు.దీనిని తెలుసుకునేందుకు దర్యాప్తు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.గతంలో జస్‌దీప్ వద్ద నిందితుడు పనిచేశాడని, ఆ సమయంలో చోటు చేసుకున్న ఘర్షణ కారణంగా వీరిపై ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.