ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో తెలుగు సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలకంటే కూడా అతి పెద్ద తెలుగు సంఘం ఏదైనా ఉందంటే అది ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( తానా) అని తడుముకోకుండా చెప్పేయచ్చు.అమెరికాలోని తెలుగు వారి సంక్షేమం కోసం స్థాపించబడిన తానా ఒక్క అమెరికాలో మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎన్నో సేవా చైతన్య కార్యక్రమాలు చేపడుతోంది.
అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో విస్తరించిన తానా సంస్థ తెలుగు వారికి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటోంది.తమ సొంత వారికి దూరంగా ఉన్నామనే భావన కలుగకుండా ఉండేందుకు, మన సంస్కృతీ సాంప్రదాయలను పాటిస్తూ, మీట్ అండ్ గ్రీట్ లు ఏర్పాటు చేస్తూ మేమున్నామనే భావన కల్పిస్తుంది.
తాజాగా తానా అమెరికాలో వనభోజనాలు ఏర్పాటు చేసింది.
అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఒక్స్ నగరంలో ఉన్న వ్యాలీ పార్క్ లో ఈ వనభోజనాలను ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమానికి పెన్సిల్వేనియా చుట్టుపక్కల ప్రాంతాల తెలుగు ప్రజలు అందరూ హాజరయ్యారు.సుమారు 800 మంది పైగా ఈ వనభోజనానికి హారవ్వడంతో వ్యాలీ పార్క్ మొత్తం తెలుగు వారితో కిక్కిరిసి పోయింది.
విచ్చేసిన వారందరికీ వారి వారి స్థాయిలకు తగ్గట్టుగా ఆట పాటల పోటీలు నిర్వహించారు.కేవలం పెన్సిల్వేనియా రాష్ట్రంలోని తెలుగు వారే కాకుండా న్యూజెర్సీ రాష్ట్రంలోని కొందరు తెలుగు వారు కూడా ఈ కార్యక్రమానికి హాయరయ్యారు.
పిల్లలకు పెద్దలకు నిర్వహించిన ఆటల పోటీలు అందరిని ఆకట్టుకున్నాయి.పాత పాటలకు పెద్దలు డ్యాన్స్ చేస్తూ అందరిని అలరిస్తూ సంతోషంగా గడిపారు.తెలుగు వంటకాలను మరో సారి రుచి చూపించేలా భోజనాలను వడ్డించారు తానా నిర్వాహకులు.ఇంత పెద్ద మొత్తంలో తెలుగు వారు కూర్చుని భోజనాలు చేయడం ఇదే మొదటి సారని, గతంలో ఎన్నో సార్లు వనభోజనాలు ఏర్పాటు చేసినా ఎప్పుడూ ఇలాంటి స్పందన రాలేదని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.
పిలిచిన వెంటనే తరలి వచ్చిన తెలుగు కుటుంబాలకు, తానా కుటుంభ సభ్యులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.