నీరజ్ చోప్రా పేరు తెలియని భారతీయులు ఉండరు.130 కోట్ల జనాభా ఉన్న మన దేశానికి ఒలింపిక్స్‌లో వచ్చే పతకాలు చాలా స్వల్పం.అందులో స్వర్ణ పతకం అంటే కోట్లాది మంది భారతీయుల గుండెలు ఉప్పొంగుతాయి.దేశ ప్రజలకు ఉండే అలాంటి స్వప్నాన్ని నీరజ్ చోప్రా నెరవేర్చాడు.జావెలిన్ త్రో విభాగంలో టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు.దేశ పతాకాన్ని ఒలింపిక్స్ క్రీడల్లో రెపరెపలాడేలా చేశాడు.
అంతటితో ఆగకుండా మరిన్ని రికార్డులు సృష్టిస్తున్నాడు.ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లతో సహా ఎన్నో క్రీడా పోటీలలో పతకాలు సాధిస్తున్నాడు.
ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్స్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయుడిగా నిలిచాడు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలో ఫౌల్ చేశాడు.కానీ తన రెండవ ప్రయత్నంలో 88.44 మీటర్ల త్రో విసిరి, అగ్ర స్థానానికి చేరుకున్నాడు.అతను తన తదుపరి నాలుగు త్రోలలో 88.00మీ, 86.11మీ, 87.00మీ మరియు 83.60మీ.విసిరాడు.చెక్ రిపబ్లిక్‌కు చెందిన ఒలింపిక్ రజత పతక విజేత జాకుబ్ వడ్లెజ్చ్ తన నాల్గవ ప్రయత్నంలో నమోదు చేసుకున్న 86.94 మీటర్ల బెస్ట్ త్రోతో రెండవ స్థానంలో నిలిచాడు.జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ అత్యుత్తమంగా 83.73 మీటర్లతో మూడో స్థానంలో నిలిచాడు.

ఇక 24 ఏళ్ల భారత సూపర్ స్టార్ నీరజ్ చోప్రా ఇప్పుడు ఒలింపిక్ ఛాంపియన్‌గానే కాకుండా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో రజత పతకం కూడా సాధించాడు.ఇప్పుడు డైమండ్ లీగ్ ఛాంపియన్‌గా నిలిచాడు.ఇవన్నీ అతను కేవలం 13 నెలల్లోనే సాధించాడు.
గతేడాది ఆగస్టు 7న టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాడు.అతను ఈ సీజన్‌లో ఆరుసార్లు 88మీ-ప్లస్ త్రోను విసిరాడు.
డైమండ్ లీగ్ ఫైనల్స్‌ను ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల తర్వాత ఆ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీగా పరిగణిస్తారు.దీనిలో విజేతగా నిలవడంతో నీరజ్ చోప్రా పేరు మరింత మార్మోగిపోతోంది.







