ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు వంద శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ ఉపాధ్యాయులను ఆదేశించారు.గురువారం కలెక్టర్ నగరంలోని స్తంభానినగర్ లోగల ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు.
పాఠశాలలో విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు.విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, గైర్హాజరు విద్యార్థుల ఇండ్లకు వెళ్లి, గైర్హాజరుకు కారణాలు తెలుసుకోవాలని, చదువు ప్రాముఖ్యతపై వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి చైతన్యం తేవాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం ఉంటుందని ఆయన తెలిపారు.పాఠశాలలో 6గురు ఉపాధ్యాయులు ఉన్నట్లు, ప్రతిరోజు తప్పక 4గురు ఉపాధ్యాయులు విధుల్లో ఉండాలని, ఇద్దరి కంటే ఎక్కువ సెలవులు మంజూరు చేయకూడదని కలెక్టర్ అన్నారు.
పాఠ్యపుస్తకాల మేరకు బోధన చేయాలని, పిల్లలకు త్వరగా అర్థమయ్యేలా బోధన ఉండాలని అన్నారు.
జిల్లా విద్యాశాఖచే చేపడుతున్న మౌఖిక పరీక్షల సరళిని కలెక్టర్ పరిశీలించారు.
విద్యార్థులు ఎంతమేర జవాబులు చెపుతున్నది కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.తరగతి గదుల్లో విద్యార్థులతో మమేకమై వారిని ప్రశ్నలు అడుగుతూ, జవాబులు రాబడుతూ, ఉపాధ్యాయులకు సూచనలు చేశారు.
1వ తరగతి విద్యార్థులకు రాయడం, చదవడంతో పాటు సంఖ్యలు, రంగులు తెలిసేలా బోధన చేయాలన్నారు.రూ.11.4 లక్షల అంచనాలతో పాఠశాలలో మన బస్తి-మన బడి కార్యక్రమం క్రింద చేపట్టిన పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు.పాఠశాలలో విద్యుద్దీకరణ, త్రాగునీరు, టాయిలెట్, ప్రహారీ గోడ, మైనర్ మేజర్ పనులు పురోగతిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.విద్యుద్దీకరణ పనులు వెంటనే పూర్తి చేసి, వెలుతురు, గాలి అందించాలని ఆయన తెలిపారు.
పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు.కలెక్టర్ పర్యటన సందర్భంగా స్థానిక కార్పొరేటర్ సిహెచ్.వెంకటనారా యణ, జిల్లా విద్యాధికారి ఎస్.యాదయ్య, మునిసిపల్ ఇఇ కృష్ణ లాల్, డిఇ ధరణి కుమార్, ఎంఇఓ ఎం.శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.