తెలంగాణలో రాజకీయంగా పట్టు సాధించేందుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్న పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే విధంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
మరి ముఖ్యంగా త్వరలో జరగబోయే మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంను మళ్ళీ తమ ఖాతాలో వేసుకోవాలనే విధంగా రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు.దీనిలో భాగంగానే టిఆర్ఎస్, బిజెపిలో కంటే దీటుగా జనాల్లోకి కాంగ్రెస్ ను తీసుకువెళ్లేందుకు 90 రోజుల కార్యచరణను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
దీనిలో భాగంగానే సెప్టెంబర్ 1 నుంచి 90 రోజుల పాటు కార్యాచరణను కాంగ్రెస్ చేపట్టింది.
మంగళవారం మధ్యాహ్నం గాంధీ భవన్ నుంచి నిర్వహించిన జూమ్ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసిసి కార్యదర్శి బోసు రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇన్చార్జిలుగా నియమితులైన నాయకులు, టిక్కెట్లు ఆశిస్తున్న వారితో సమావేశం నిర్వహించారు.మండలాల ఇన్చార్జిలుగా నియమించిన వారు సెప్టెంబర్ ఒకటి నుంచి ఎన్నికలు ముగిసే వరకు పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.

మండలాల ఇన్చార్జిలే రోజుకొక గ్రామ బాధ్యత తీసుకుని ప్రచార కార్యక్రమాలు ఉదృతంగా నిర్వహించాలని, సెప్టెంబర్ మొదటి వారంలోనే టీపీసీసీ ఆధ్వర్యంలో మండల స్థాయిలో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తామని రేవంత్ తెలిపారు.కాంగ్రెస్ కొత్తగా అమలు చేయబోతున్న 90 రోజుల కార్యక్రమం లో భాగంగా ప్రజలు ఎవరికి ఓటు వేయాలో ఆలోచించాల్సిందిగా పెద్ద ఎత్తున కరపత్రాలు రూపంలో పంపిణీ చేయాలని, టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన రుణమాఫీ, ఉద్యోగాలు భర్తీ, నిరుద్యోగ భృతి వంటి అన్ని అంశాలను ప్రస్తావించి ప్రజల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నారు.







