వైఎస్సార్ సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎప్పుడూ ఏదో ఒక రాజకీయ అలజడి సృష్టిస్తూనే, ఉంటారు.ముఖ్యంగా తాను ఎంపీగా గెలవడానికి కారణమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైనే తరచుగా విమర్శలు చేస్తూ, ఏపీ ప్రభుత్వం విధానాలను, జగన్ తీసుకుంటున్న నిర్ణయం తప్పుపడుతూ మీడియాలో తరచుగా కనపడుతూ ఉంటారు.
రఘురాం కృష్ణంరాజు అనర్హత వేటు వేయించాలని వైసీపీ ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా, అది సాధ్యం కాకపోవడంతో మరింత ఉత్సాహంగా వైసీపీని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు.ఇక అప్పుడప్పుడు సర్వేలో ఫలితాలను ప్రకటిస్తూ ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోందని ప్రకటించడం ఆనవాయితీ గా మారింది.
తాజాగా ఏపీ ఎన్నికల ఫలితాలపై చేయించిన సర్వే వివరాలు బయటపెట్టారు.ఈ సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యల్ప స్థానాలు వస్తాయని తేల్చారు.
ఓ యాప్ ద్వారా ఏపీలో ఎన్నికల పరిస్థితి, ఫలితాలపై సర్వే చేయించినట్లుగా ఆయన ప్రకటించారు.ఆ సర్వే వివరాల ప్రకారం రాయలసీమ జిల్లాలోని చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం జిల్లాలో టిడిపి అత్యధిక స్థానాలను దక్కించుకుంటుందని, కడపలో వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని , ప్రకాశం గుంటూరులో టిడిపి వైఎస్సార్సీపీ మధ్య పోటీ హోరా హోరీగా ఉంటుందని , అలాగే ఉమ్మడి తూర్పు ,పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని రఘురామ చెప్పుకొచ్చారు.
ఖచ్చితంగా టిడిపి 54 స్థానాలను గెలుస్తుందని, 39 స్థానాల్లో టీడీపీకి ఎక్కువ అవకాశం ఉందని , ఆ రెండిటిని కలుపుకుంటే దాదాపు 93 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉందని రఘురామ ఆ సర్వే వివరాలు బయటపెట్టారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా వైసిపికి 14 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని, మిగిలిన 68 నియోజకవర్గాల్లో హోరా హోరీగా పోటీ ఉంటుందని, వీటిలో గోదావరి జిల్లాలకు చెందిన నియోజకవర్గంలో జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుందని టిడిపి జనసేన కలిపి పోటీ చేస్తే 68 స్థానాల్లోనూ జనసేన టిడిపి కూటమి గెలుస్తుందని, ఆ లెక్కన టిడిపి, జనసేన కూటమికి 127 స్థానాలు వస్తాయని రఘురామ ప్రకటించారు. అయితే ఓ ప్రైవేట్ యాప్ ద్వారా ఈ సర్వే చేపట్టినట్లు ఆయన చెబుతుండడంతో ఆ సర్వే కు ఉన్న విశ్వసనీయత పై అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి .ఎందుకంటే చాలాకాలంగా వైసీపీ పై రఘురామ అసంతృప్తిగా ఉంటూ విమర్శలు చేస్తున్నారు.అలాగే టిడిపి కి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు.దీంతో రఘురామ సర్వే ఫలితాలను ఎవరు సీరియస్ గా తీసుకోవడం లేదు.
.






