దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి అయోమయం అరణ్యవాసం ఉన్నట్లుగా తయారైంది.ఒక్కో రాష్ట్రంలో కాంగ్రెస్ తన పట్టు కోల్పోతూ ఉండడం, జాతీయ స్థాయిలో అధికారంలోకి రావడం కష్టం అనే అభిప్రాయం పార్టీ నాయకులు , జనాల్లోనూ రావడంతో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.
అంతేకాకుండా నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ సైతం విచారణ ఎదుర్కొంటూ ఉండడం, దేశవ్యాప్తంగా బిజెపి రోజురోజుకు బలం పెంచుకుంటూ రావడంతో పాటు, ఒక్కో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటూ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుండడం వంటివి కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారాయి.ఈ పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ నాయకుల్లో ఆందోళన నెలకొనడంతో ఆ పరిస్థితిని మార్చాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకుంది.
ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు సోనియా స్వీకరించారు.అంతకుముందు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో సోనియా ఆ పదవి చేపట్టారు.
ఇప్పటికే రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే విషయంలో సుముఖంగా లేకపోవడంతో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఎవరు తీసుకుంటారనేది ఉత్కంఠ గా మారింది.ఈరోజు నుంచి సెప్టెంబర్ 20వ తేదీ వరకు పార్టీ అధ్యక్షుడి ఎంపిక సంబంధించిన ప్రక్రియ జరుగుతుంది.
దీంట్లో ఓటు వేసే వారి జాబితాను కూడా సిద్ధం చేశారు .త్వరలోనే దీనికి సంబంధించి ఎన్నికల తేదీని ప్రకటించబోతున్నారు.

అయితే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు రాహుల్ ససేమిరా అంటున్నా ఆయనను ఒప్పించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.సోనియా, రాహుల్ ఇద్దరూ ఇదే వైఖరితో ఉంటే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను ప్రియాంక గాంధీకి ఇవ్వాలనే ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది .ఈ ఏడాది జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బాధ్యతలను చూసిన ప్రియాంక గాంధీ అక్కడ వైఫల్యం చెందడంతో ఆమె కు ఆ బాధ్యతలను ఇవ్వడం సరికాదనే వాదనలు వస్తున్నాయి.అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రియాంక గాంధీనే కాంగ్రెస్ ను ఒడ్డున పడేయగలరు అనే నమ్మకం ఉండడం తో ఆమెనే మెజార్టీ కాంగ్రెస్ సభ్యులు ఎన్నుకుంటారనే టాక్ నడుస్తోంది.







