ప్రపంచానికే స్పూర్తిగా నిలిచిన మన జాతి పిత మహాత్మా గాంధీపై అమెరికాలో మరో సారి దాడి జరిగిన ఘటన భారతీయులను కలిచివేస్తోంది.రెండు వారాల క్రితం అమెరికాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకోగా భారతీయులు ర్యాలీ నిర్వహించి విగ్రహంపై దాడి చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు ఈ క్రమంలో స్పందించిన అమెరికా ప్రభుత్వం భారత్ కు క్షమాపణలు చెప్తూ దుండగులను పట్టుకుంటామని హామీ ఇచ్చింది కూడా.
ఈ ఘటన మరువక ముందే 20 రోజుల్లోగానే మరో సారి అమెరికాలో గాంధీ విగ్రహం పై దాడి జరగడం భారతీయులను మరింత ఆవేదనకు గురి చేస్తోంది.వివరాలలోకి వెళ్తే.
అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో శ్రీ తులసి మందిర్ ఆలయం వద్దనున్న గాంధీ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద సుత్తితో పగుల కొట్టి ధ్వంసం చేశారు.రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తెల్ల వారు ఝామున రెండు కార్లలో వచ్చిన ఆరుగురు దుండగులు తమతో తీసుకువచ్చిన సుత్తితో బలంగా విగ్రహంపై కొట్టడంతో ధ్వంసం అయ్యిందని, విగ్రహాన్ని కింద పడేసిన తరువాత జాతి పితను అవమానించేలా అమానుషమైన రాతలు రాశారని పోలీసులు తెలిపారు.విగ్రహన్ని ధ్వంసం చేయడంలో పాల్గొన్న దుండగులలో అందరూ 25 -30 ఏళ్ళ మధ్య వయసు వారేనని తెలుస్తోంది.

గతంలో ఇదే విగ్రహాన్ని ద్వంసం చేయడానికి దుండగులు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది దాంతో దుండగులు మరో సారి దాడి చేయడంతో పూర్తిగా ద్వంసం అయ్యిందని భారతీయ ఎన్నారైలు వాపోతున్నారు.అక్కడ ఉన్న సిసి టీవీ పుటేజ్ లలో రికార్డ్ అయిన వివరాలను సేకరించిన స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. న్యూయార్క్ రాష్ట్ర అస్లెంబ్లీ సభ్యురాలైన జెన్నిఫర్ రాజ్ కుమార్ ఈ ఘటనను ఖండించారు.దుండగులను త్వరలో పట్టుకుని శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.







