గతంతో పోలిస్తే తెలంగాణ బిజెపి బాగానే బలం పెంచుకుంది.అధికార పార్టీ టిఆర్ఎస్ కు సవాల్ విసిరే స్థాయికి చేరుకుంది.
తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లోను బిజెపి అభ్యర్థులు గెలుపొందడం మరింత ఉత్సాహాన్ని కలిగించింది.తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ స్థాయిలో పార్టీ బలోపేతం కావడం , కేంద్ర బిజెపి పెద్దలకు సంతృప్తి కలిగిస్తున్నా, మిగతా నాయకుల విషయంలో మాత్రం తీవ్ర అసంతృప్తి ఉంది.
ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో చోటుచేసుకుంటున్న పరిణామాలు వంటి అన్ని విషయాల పైన కేంద్ర బిజెపి పెద్దలు రహస్యంగా సర్వేలు నిర్వహిస్తున్నారు.
ఈ సర్వేల్లో తేలిన ఫలితాలు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయట.
దీంతో తెలంగాణ బిజెపిలో సమూహం ప్రక్షాళన చేపట్టాలని బిజెపి అధిష్టానం పెద్దలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.ముఖ్యంగా బీజేపీ అనుబంధ కమిటీలలోని వివిధ మోర్చాల పనితీరుపై బిజెపి పెద్దలు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
ముఖ్యంగా సర్వేల నివేదికలో ఒకటి రెండు మోర్చాల పనితీరు ఏమాత్రం బాగాలేదని తేలిందట.ఇక బిజెపి జిల్లా అధ్యక్షుల పనితీరు అంతంత మాత్రం గానే ఉన్నట్లు బిజెపి అంతర్గత సమావేశాల్లో బిజెపి పెద్దలు అభిప్రాయపడ్డారట.

బిజెపి రాష్ట్ర కమిటీ ఏదైనా పిలుపునిస్తే తప్ప, స్థానికంగా నెలకొన్న సమస్యలపై టిఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు బిజెపి నాయకులు ఎవరు ఆసక్తి చూపించడం లేదని, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లోనూ నామమాత్రంగానే పాల్గొంటున్నట్లు తేలిందట.కొద్దిరోజుల క్రితమే తెలంగాణకు వచ్చిన బిజెపి సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ సైతం జిల్లా అధ్యక్షులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం .పార్టీ పదవుల్లో ఉన్నవారు హైదరాబాద్ లో కాకుండా జిల్లాల్లో ఉండాలని గట్టిగానే క్లాస్ పీకారట.మరికొద్ది రోజుల్లోనే పది జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తారని, ప్రస్తుతం ఉన్న కమిటీ లోను కొన్ని కొన్ని మార్పులు చేసి యాక్టివ్ గా ఉన్న నేతలకు కీలక పదవులు అప్పగించబోతున్నట్లు సమాచారం.







