వైసిపి ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు, పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు.ఆ సంక్షేమ పథకాల ద్వారా దాదాపు అంతా లబ్ధి పొందిన వారే కావడం, పార్టీలకు , కులమతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ ఉండడం వంటి కారణాలతో జగన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.
చాలా రాష్ట్రాలు జగన్ పథకాలను రోల్ మోడల్ గా తీసుకుని తమ తమ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నాయి.ఈ సంక్షేమ పథకాలే రాబోయే ఎన్నికల్లో మళ్ళీ వైసీపీకి అధికారం కట్టబెడుతుంది అనే నమ్మకంతో జగన్ ఉన్నారు.ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర మాత్రమే సమయం ఉండడంతో జగన్ ముందుగానే అలర్ట్ అవుతున్నారు. 2024 ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 175 చాట్ల గెలిచి తీరాలి అనే పట్టుదలతో జగన్ ఉన్నారు.దీనిలో భాగంగానే వైసిపి ప్రజాప్రతినిధులంతా నిత్యం జనాల్లో ఉంటూ, జనాల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో వినూత్న కార్యక్రమాన్ని రూపొందించారు.రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుండగా చాలా చోట్ల వైసిపి ఎమ్మెల్యేలను ఇతర ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తూ , తమ సమస్యలను ఏకరువు పెడుతున్న తీరును టిడిపి అనుకూల మీడియా హైలెట్ చేస్తూ, మరింతగా అభాసు పాలు చేస్తున్న తీరు వైసీపీ ప్రభుత్వానికి బాగా డామేజ్ చేస్తోంది.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని , రోడ్లు మురుగునీరు పారుదల, తాగునీరు సౌకర్యం లేదు అని ఇంకా అనేక సమస్యలను ప్రజలు ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేలను గట్టిగానే నిలదీస్తున్నారు.

ఈ సందర్భంగా కొంతమంది వైసిపి ప్రజాప్రతినిధులు ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంఘటనలు వైరల్ అవుతున్నాయి.ఈరోజు జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు , ఎంపీలు, ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సిపి ప్రాంతీయ సమన్వయకర్తలు , జిల్లాల పార్టీల అధ్యక్షులతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.ఈ సందర్భంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఏర్పడుతున్న ఇబ్బందులు , అడిగి తెలుసుకోవడంతో పాటు, ప్రజలు సమస్యలపై నిలదీస్తుంటే చాకచక్యంగా సమాధానం చెప్పాలి తప్ప వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దూషణలకు దిగడం వల్ల మీ పరువు, పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందనే విషయాన్ని జగన్ తనదైన శైలిలో చెప్పడంతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలకు , ముఖ్య నాయకులకు గట్టిగానే క్లాస్ పీకబోతున్నారట.







