అమెరికా పేరు చెప్తే గుర్తొచ్చేది ఒక పక్క గన్ కల్చర్ అయితే మరో పక్క జాతి వివక్ష దాడులు.ఈ రెండు అమెరికాకు అతి పెద్ద భూతంగా తయారయ్యాయి.
ప్రభుత్వం ఈ రెండు విషయాలలో తీసుకునే చర్యలపై చూపించే అలసత్వం కారణంగా ఎన్నో సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.జాతి వివక్ష కారణంగా ఎంతో మంది అమాయకపు ప్రజలు స్థానిక తూటాలకు బలైపోతున్నారు కూడా.
అయితే ఈ వివక్ష కేవలం సామాన్య ప్రజలపై మాత్రమే కాదు సమాజంలో ఉన్నత స్థాయిలో వెలుగొందుతున్న ప్రముఖులపై కూడా చూపుతున్నారు.తాజాగా అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు, ఇండో అమెరికన్, ప్రస్తుత అధికార డెమోక్రటిక్ పార్టీ కి చెందిన ప్రమీలా జయపాల్ సైతం జాతి వివక్షను ఎదుర్కున్నారు.
ఈ విషయాన్ని అధికారులు సైతం విచారణ చేపట్టి మరీ ధ్రువీకరించారు.ఇంతకీ అసలేం జరిగిందంటే.
అమెరికాలోని సియాటిల్ కి చెందిన ఓ వ్యక్తి ప్రమీలా జయపాల్ నివాసం ఉండే ఇంటి వద్దకు వచ్చి ఆమెపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ నువ్వు అమెరికా వదిలి ఇండియా పో అంటూ తీవ్ర పదజాలంతో జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు.అంతేకాదు అతడితో తెచ్చుకున్న తుపాకి తో గాలిలోకి కాల్పులు జరిపాడు.
ఈ ఘటన జరుగుతున్న సమయంలో ప్రమీలా జయపాల్ సెక్యూరిటీ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి కటినమైన చర్యలు తీసుకోవాలని ఇండో అమెరికన్ సంఘాలు డిమాండ్ చేశాయి.
కాగా డెమోక్రటిక్ పార్టీ కి చెందిన కీలక నేతపైనే ఇలాంటి వివక్ష దాడులు జరిగితే సాధారణ జీవితం గడిపే మిగిలిన ఇండో అమెరికన్స్ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు ఎన్నారైలు.







