కరోనా తర్వాత ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయడానికి అలవాటుపడ్డారు.అయితే తాజాగా నెదర్లాండ్స్ దేశం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని చట్టబద్ధమైన హక్కుగా మార్చేందుకు సిద్ధమైంది.7 రోజుల క్రితం డచ్ పార్లమెంట్ దిగువ సభ ఈ చట్టబద్ధమైన హక్కుకు సంబంధించి ఒక చట్టంపై ఆమోదముద్ర వేసింది.ఇప్పుడు సెనేట్ కూడా ఆమోదం తెలిపితే ఈ హక్కు అమల్లోకి వస్తుంది.
ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం, నెదర్లాండ్స్‌లోని కంపెనీలు కారణం చెప్పకుండానే ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్వెస్ట్ ను రిజెక్ట్ చేయవచ్చు.అయితే కొత్త చట్టానికి ఆమోదం లభించి అది అమల్లోకి వస్తే మాత్రం.
కంపెనీలు తమ ఉద్యోగుల విజ్ఞప్తిలన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.అంతేకాదు ఇంటి నుంచి పనిని తిరస్కరించడానికి తగిన కారణాలను తెలియపరచాల్సి ఉంటుంది.
నిజానికి నెదర్లాండ్స్ దేశంలో పనిచేసే ఉద్యోగుల, కార్మికుల హక్కులకు ప్రభుత్వం ఇప్పటికే ఎంతో మంచి గౌరవం ఇస్తోంది.కంపెనీలు కూడా కార్మికుల హక్కులకు తగిన గౌరవం ప్రాధాన్యత ఇస్తూ నడుచుకుంటున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు తీసుకురావడానికి తెగ కష్టపడుతున్నాయి.ఈ నేపథ్యంలోనే నెదర్లాండ్స్ కొత్త చట్టం తీసుకొస్తామని ప్రకటించడం కంపెనీలకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.
అయితే ఉద్యోగులను ఆఫీసులకు వచ్చేలా చేసేందుకు కొన్ని కంపెనీలు వారికి సకల సౌకర్యాలు అందిస్తున్నాయి.ఈ తరహా కంపెనీలు సదుపాయాలు పెంచుతూ ఉంటే, మరికొన్ని శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వీలును ఇచ్చేశాయి.







