తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి.అయితే ఆ రాజకీయాలు ఎప్పుడు ఎవరి మధ్య ఉంటాయో చెప్పడం కష్టమే.
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్, రేవంత్‌రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే టాక్ వినిపిస్తోంది.ఇటీవల రేవంత్‌రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించాలని భావిస్తే ఆయన పర్యటనను కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి.
దీంతో ఈ రెండు వర్గాల మధ్య వ్యవహారాలు ఉప్పు, నిప్పుల్లా ఉంటున్నాయి.
కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో పీసీసీ అధ్యక్ష పదవి కోసం కోమటిరెడ్డి సోదరులు ఆశపడుతున్నారు.
అయితే ఆ పదవి ఉన్నట్టుండి రేవంత్‌రెడ్డికి దక్కడంతో అసమ్మతి భగ్గుమంది.ఓటుకు నోటు కేసులో జైలుకి వెళ్లిన వ్యక్తికి పార్టీ అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బహిరంగంగానే విమర్శించారు.
ఓటుకు నోటు లాగానే పీసీసీ పదవిని కూడా రేవంత్ కొనుగోలు చేశారని విమర్శలు చేశారు.ఈ విషయంలో జగ్గారెడ్డి, వీహెచ్, భట్టి విక్రమార్క లాంటి సీనియర్లు కూడా కోమటిరెడ్డికి మద్దతు తెలిపారు.
అయితే అనంతర పరిణామాల కారణంగా కోమటిరెడ్డి ఇంటికి రేవంత్‌రెడ్డి వెళ్లి సమావేశం కావడంతో భిన్న ధృవాలుగా కనిపించిన ఇరువురు నేతల మధ్య సయోధ్య కుదిరినట్లు కనిపించింది.కానీ మళ్లీ నెలరోజుల కిందట నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశానికి రేవంత్‌రెడ్డి వెళ్లాలని భావించగా కోమటిరెడ్డి బ్రదర్స్ మరోసారి వ్యతిరేకించడంతో పార్టీలో లుకలుకలు బహిర్గతం అయ్యాయి.

ఈ నేపథ్యంలో కోమటి రెడ్డి బ్రదర్స్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి షాక్ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది.రేవంత్ రెడ్డి త్వరలోనే కోమటిరెడ్డి బ్రదర్స్ సొంత జిల్లాలో పర్యటించి తన పట్టు నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మునుగోడులో పర్యటనకు సిధ్దం చేసుకున్నట్లు సమాచారం.ఇటీవల మునుగోడుకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు రేవంత్‌రెడ్డితో సమావేశమై నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కొన్నాళ్లుగా పార్టీలో సైలెంట్ అవ్వడంతో రేవంత్ పైచేయి సాధిస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.







