వరకట్న వేధింపులతో కోడలిని ఇంటినుంచి గెంటివేత.యాదవ సంఘం భవన్ లో తలదాచుకున్న బాధితురాలు.
నల్లగొండ జిల్లా కేంద్రం శివాజీ నగర్ లో ఉద్రిక్తత.కోర్టులో నడుస్తున్నదని హెచ్చరించిన ఎస్ఐ
నల్లగొండ జిల్లా:వరకట్న వేధింపులతో అత్తమామలు కోడలిపై దాడి చేసిన ఘటన శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ లో వెలుగుచూసింది.బాధితురాలు కళావతి తెలిపిన వివరాల ప్రకారం మల్లేపల్లి మండలం దేవరపల్లికి చెందిన కళావతికి, జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ లో నివాసముండే మాండ్ర యాదగిరి రేణుకల కుమారుడు శివతో పదేండ్ల క్రితం వివాహం అయింది.వారికి ఎనిమిదేండ్ల కుమార్తె కూడా ఉంది.
శివ పలు గొడవల్లో తలదూర్చడంతో నాలుగేండ్ల క్రితం ప్రత్యర్థులు దాడి చేయడంతో మెడనరాలు చితికి పక్షవాతం వచ్చింది.అప్పటి నుంచి శారీరక,మానసిక అంగ వైకల్యంతో మంచానికే పరిమితమయ్యాడు.
ఈ క్రమంలో ఆరు నెలల క్రితం ఆమె మామ యాదగిరి అత్త రేణుక కోడలిని అదనపు కట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేస్తున్నారు.వివాహ సమయంలోనే రూ.15 లక్షల నగదు,10 తులాల బంగారం వరకట్నం కింద తీసుకురావడంతో ఆమె తల్లిదండ్రులను ఒత్తిడి చేయలేకపోయింది.దీంతో ఆమె అత్తమామలు ఆరునెలల క్రితం ఇంటినుంచి బయటకు గెంటివేశారు.
ఆమె మహిళా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా,శివ వర్గీయులు కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశారు.అప్పటినుంచి కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది.ఈ క్రమంలో కళావతి వారం రోజులుగా శివాజీనగర్ లోని అత్తింటికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ,కుమార్తెతో పాటు స్థానిక యాదవ సంఘం భవన్ లో తలదాచుకుంటుంది.ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కూడా కళావతి నిరసన వ్యక్తం చేస్తుండగా ఆమె పుట్టిల్లు దేవరపల్లి నుండి తల్లిదండ్రులతో పాటు బంధువులు కూడా వచ్చారు.
ఈ క్రమంలో మాటామాట పెరిగి మాండ్ర యాదగిరి రేణుక కోడలిపై దాడికి పాల్పడారు.ఈ సంఘటనతో శివాజీనగర్ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
యాదవ సంఘం మహిళా జిల్లా అధ్యక్షురాలు మామిడి పద్మ ఇరువర్గాలకు నచ్చజెప్పి అక్కడినుంచి పంపించారు.కాగా ఇరువర్గాలు కూడా టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.
ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు.ఇరు వర్గాలు కోర్టును ఆశ్రయించారని,తీర్పు వచ్చే వరకూ శాంతియుతంగా ఉండాలని సూచించారు.
ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతమైతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.