ఏపీ బీజేపీలో జోష్ పెరుగుతోంది.పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాకతో కేడర్ లో ఉత్సాహం పొంగుతోంది.
అధికారం నిలుపుకునేందుకు వైసీపీ, ఎలాగైనా అధికారంలోకి రావడానికి టీడీపీ తంటాలు పడుతున్నాయి.ఈ పూర్వ రంగంలో జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ ఈ సారి అధికారం తమదే అంటోంది.
రెండు సంవత్సరాల ముందే ఏపీ ఎన్నికల వాతావరణం వచ్చేసింది.గత అనేక నెలలుగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
అధికార వైసీపీ తమ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించేందుకు గడప గడపకు కార్యక్రమం నిర్వహిస్తోంది.ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించింది.
మహానాడు ఉత్సాహంగా జరగడంతో టీడీపీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది.మూడేళ్ళ తర్వాత తెలుగుదేశం శ్రేణులు ఎంతో ఉత్సాహంగా ఉన్నాయి.వార్ వన్ సైడే అంటూ చంద్రబాబు చేసిన కామెంట్ వారిలో పెరిగిన మనోధైర్యాన్ని సూచిస్తోంది.ఇక జనసేన అధినేత ఎప్పుడు ప్రజల్లోకి వెళ్లినా జనం నీరాజనాలు పడుతున్నారు.
దీంతో ఈసారి ఎలాగైనా ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా చూసి వైసీపీని ఓడించాలని పవన్ పిలుపునిచ్చారు.ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా చూసే బాధ్యత తనదే అన్నారు.

ఇప్పటివరకు తాను తగ్గానని…ఈసారి టీడీపీ కొంచెం తగ్గాలని సూచించారు పవన్ కల్యాణ్. వచ్పే ఎన్నికల్లో అధికారం కోసం జనసేనాని మూడు ఆప్షన్లను ప్రకటించారు.అందులో టీడీపీతో కలసి వెళ్ళడం, టీడీపీ, బీజేపీతోను కలిసి వెళ్ళడం లేదంటే సింగిల్ గా వెళ్ళడం వంటివి ఉన్నాయి.నడ్డా పర్యటనకు ముందు టీడీపీ, జనసేన మధ్య జరిగిన పొత్తుల మాటలు రెండు పార్టీల మధ్య చిచ్చు రేపాయి.
పవన్ కామెంట్స్ తర్వాత టీడీపీ కూడా అధికారికంగా వ్యాఖ్యానించలేదు.బీజేపీ మాత్రం వేచి చూసే ఆలోచనలో ఉంది.వైసీపీ మాత్రం సింగిల్ గానే తమ పోరాటం కొనసాగుతుందని చెబుతోంది.







