వైసీపీలో మాటలు కోటలు దాటేలా మాట్లాడే నేతలు చాలా మందే ఉన్నారు.వారిలో మాజీ మంత్రి కొడాలి నాని అందరి కంటే ముందుంటారు.
ఆయన నోరెత్తారంటే నోటి వెంట బూతు పదాలు రాకుండా మానవు.అందుకే వైసీపీ ప్రభుత్వంలో ఆయన బూతుల మంత్రిగా ముద్ర వేయించుకున్నారు.
మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రిగా చేసిన మరో నాని కూడా ఉన్నారు.ఆయనే పేర్ని నాని.
అయితే కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో ఈ ఇద్దరు మంత్రులను సీఎం జగన్ పక్కన పెట్టారు.
జగన్‌పై చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఒక్క మాట మాట్లాడినా ఈ ఇద్దరు మంత్రులు ఉవ్వెత్తున లెగిచేవారు.
జగన్ మీద ఈగ వాలినా వాలకపోయినా ప్రతిపక్ష నేతల మీద మాత్రం వీళ్లు తమ మాటలతో విరుచుకుపడేవాళ్లు.అయితే గడిచిన నెలన్నర రోజుల్లో ఈ ఇద్దరు మీడియా ముందు అడపాదడపా కనిపిస్తున్నారు తప్పితే పార్టీలో యాక్టివ్‌గా కనిపించడంలేదు.
దీంతో మంత్రి పదవి మళ్లీ రాకపోవడంతో వీళ్లిద్దరూ అలకబూనారనే టాక్ వినిపిస్తోంది.కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో తమ సామాజిక వర్గానికి ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా వివక్ష చూపించారన్న ఆవేదన కొడాలి నానిలో కనిపిస్తోందని పలువురు భావిస్తున్నారు.
అటు పేర్ని నాని పరిస్థితి కూడా ఇలాగే ఉందని.తనకు మంత్రి పదవి పోయిందనే బాధ లేదని పైకి బడాయి మాటలు చెప్పినా ఆయనలోనూ అసంతృప్తి ఉందనే టాక్ నడుస్తోంది.
అందుకే గడిచిన 50 రోజుల్లో అటు పవన్, ఇటు చంద్రబాబు, లోకేష్ గతంలో కంటే ఎక్కువగా జగన్‌ను టార్గెట్ చేసినా ఈ ఇద్దరు మాజీ మంత్రులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

అయితే మూడేళ్ల పాటు మంత్రులుగా ఉన్న ఈ ఇద్దరు నాయకులు ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో మౌనం దాల్చడం మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.జగన్ వీళ్లిద్దరినీ పిలిచి వ్యక్తిగతంగా మాట్లాడాలని.కీలక బాధ్యతలు అప్పగించాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.
రానున్న రోజుల్లో కూడా ఇద్దరు నానిల తీరు ఇలాగే ఉంటే వైసీపీకి మాత్రం పెద్ద లోటేనని.ఒకవేళ యాక్టివ్ అయినా అదే సమయంలో ప్రజాభిమానం పొందడంపైనా వీళ్లిద్దరూ దృష్టి సారిస్తే మంచిదని పలువురు హితవు పలుకుతున్నారు.







