నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ ఎడమ కాలువలో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళ,ఇద్దరు పిల్లలను ఇద్దరు వ్యక్తులు ప్రాణాలకు తెగించి కాపాడిన ఘటన నల్లగొండ జిల్లాలో వెలుగుచూసింది.వివరాల్లోకి వెళితే శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో అనుముల మండలం హాలియాలోని శివాలయం దగ్గర సాగర్ ఎడమ కాలువలోకి ఇద్దరు పిల్లలతో సహా తల్లి దూకడంతో అటుగా వెళ్తున్న మేకల సతీష్ మరియు మేకపోతుల వేణుగోపాల్ రెడ్డిలు అది గమనించి ప్రాణాలకు తెగించి కాలువలోకి దూకి మహిళను,ఇద్దరి పిల్లలను కాపాడి,హాలియా పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే స్పందించిన హాలియా పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను పోలీసు స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు.అనంతరం ఆమె తండ్రిని పిలిపించి అతనికి అప్పగించారు.
కుటుంబ కలహాల కారణంగానే బాధిత మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.వేగంగా స్పందించి ధైర్య సాహసాలు ప్రదర్శించి ఒక మహిళ తన ఇద్దరు పిల్లలను (మూగ & చెవిటి) ప్రాణాలను కాపాడిన మేకల సతీష్ మరియు మేకపోతుల వేణుగోపాల్ రెడ్డి లను ఎస్ఐ క్రాంతి కుమార్ పోలీసు స్టేషన్ కు పిలిపించి సన్మానించారు.
ముగ్గురి ప్రాణాలను కాపాడిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు,ప్రజలు ప్రసంశలు కురిపించారు.